ఇంటర్నెట్‌ ఎకానమీ @ 250 బిలియన్‌ డాలర్లు | Internet economy expected to double by 2020: BCG-TiE | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ ఎకానమీ @ 250 బిలియన్‌ డాలర్లు

Published Sat, Apr 8 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

ఇంటర్నెట్‌ ఎకానమీ @ 250 బిలియన్‌ డాలర్లు

ఇంటర్నెట్‌ ఎకానమీ @ 250 బిలియన్‌ డాలర్లు

2020 నాటికి భారత మార్కెట్‌పై బీసీజీ–టీఐఈ అంచనా
భారీగా పెరుగుతున్న ఆన్‌లైన్‌ యూజర్లు, డేటా వినియోగం
ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతం


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ యూజర్లు, డేటా వినియోగం వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2020 నాటికి భారత ఇంటర్నెట్‌ ఎకానమీ 250 బిలియన్‌ డాలర్ల స్థాయికి (సుమారు రూ.16,25,000 కోట్లు)  చేరనుంది. ప్రస్తుతం ఇది 100–130 బిలియన్‌ డాలర్ల (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 5 శాతం వాటా) స్థాయిలో ఉంది. ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతంతో గణనీయంగా వృద్ధి చెంది 2020 నాటికల్లా ఇంటర్నెట్‌ ఎకానమీ 215–265 బిలియన్‌ డాలర్ల స్థాయికి (జీడీపీలో 7.5 శాతం) చేరవచ్చని కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ, ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టీఐఈ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో అంచనా వేశాయి.

ఈ వృద్ధిలో .. ఈ–కామర్స్, ఆర్థిక సేవల వాటా 40–50 బిలియన్‌ డాలర్లు, ఈ–కామర్స్‌ ఉత్పత్తుల వాటా 45–50 బిలియన్‌ డాలర్లు, డిజిటల్‌ మీడియా .. అడ్వర్టైజింగ్‌ వాటా 5–8 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండనుంది. ఇందులో అత్యధికంగా ఇన్‌ఫ్రాపై ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల రూపంలో (50–60 బిలియన్‌ డాలర్లు) ఉండవచ్చని నివేదిక వివరించింది. ఇక కనెక్టివిటీపరమైన వాటా 45–55 బిలియన్‌ డాలర్ల స్థాయిలో, డివైజ్‌ల వాటా 30–40 బిలియన్‌ డాలర్ల మేర ఉండగలదని పేర్కొంది.

65 కోట్లకు మొబైల్‌ ఇంటర్నెట్‌ యూజర్లు ..
నివేదిక ప్రకారం సుమారు 39.1 కోట్ల మంది యూజర్లతో భారత్‌ ఇప్పటికే మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగదారులపరంగా అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య 65 కోట్లకు చేరనుంది. అదే సమయంలో డేటా వినియోగం 10–14 రెట్లు పెరగనుంది. అప్పటికల్లా ప్రతి యూజరు డేటా వినియోగం సగటున నెలకు 7–10 జీబీ స్థాయికి చేరనుంది. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ వాడకం పెరగడం వల్ల యూజర్లు ఆన్‌లైన్‌లో గడిపే సమయం కూడా 3–4 రెట్లు పెరిగిపోనుంది. 4జీ డివైజ్‌లు, విశ్వసనీయమైన హై స్పీడ్‌ డేటా, డిజిటల్‌ కంటెంట్‌ విస్తరణ మొదలైనవి భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుదలకు దోహదపడగలవని బీసీజీ పార్ట్‌నర్‌ నిమిష జైన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement