Internet Economy
-
లక్ష కోట్ల డాలర్లకు ఇంటర్నెట్ ఎకానమీ
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం దన్నుతో దేశీ ఇంటర్నెట్ ఎకానమీ 2030 నాటికి ఆరింతలు పెరగనుంది. 1 లక్ష కోట్ల డాలర్లకు చేరనుంది. గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో భారత ఇంటర్నెట్ ఎకానమీ 155–175 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. బీ2సీ ఈ–కామర్స్ విభాగం, బీ2బీ ఈ–కామర్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్విస్ ప్రొవైడర్లు, ఓవర్ ది టాప్ సంస్థల (ఓటీటీ) వంటి ఆన్లైన్ మీడియా దేశీ ఇంటర్నెట్ ఎకానమీకి వృద్ధి కారకాలుగా ఉండగలవని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్ గుప్తా తెలిపారు. భవిష్యత్తులో చాలా మటుకు కొనుగోళ్లు డిజిటల్‌గానే జరగనున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణలకు అంకుర సంస్థలు బాటలు వేయగా, కోవిడ్ మహమ్మారి అనంతరం చిన్న–మధ్య–భారీ తరహా సంస్థలు మార్కెట్లో దీటుగా పోటీపడేందుకు డిజిటల్ సాంకేతికతలను గణనీయంగా ఉపయోగించడం ఆరంభించాయన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధికి భారత్ కొత్త ఆశాదీపంగా మారిందని టెమాసెక్ ఎండీ (ఇన్వెస్ట్మెంట్స్) విశేష్ శ్రీవాస్తవ్ తెలిపారు. డిజిటల్ సాంకేతికతలను ఆర్థిక కార్యకలాపాల్లో విస్తృతంగా వినియోగించే ఆర్థిక వ్యవస్థను ఇంటర్నెట్ ఎకానమీగా పరిగణిస్తారు. నివేదిక ప్రకారం.. ♦ బీ2సీ ఈ–కామర్స్ 2022లో 60–65 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 5–6 రెట్లు పెరిగి 350–380 బిలియన్ డాలర్లకు చేరనుంది. ♦ బీ2బీ ఈ–కామర్స్ 8–9 బిలియన్ డాలర్ల నుంచి 13–14 రెట్లు పెరిగి 105–120 బిలియన్ డాలర్లకు ఎగియనుంది. ♦ సాఫ్ట్వేర్–యాజ్–ఎ–సర్వీస్ విభాగం 5–6 రెట్లు వృద్ధి చెంది 12–13 బిలియన్ డాలర్ల నుంచి 65–75 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఇంటర్నెట్ ఎకానమీ @ 250 బిలియన్ డాలర్లు
⇒ 2020 నాటికి భారత మార్కెట్‌పై బీసీజీ–టీఐఈ అంచనా ⇒ భారీగా పెరుగుతున్న ఆన్లైన్ యూజర్లు, డేటా వినియోగం ⇒ ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతం న్యూఢిల్లీ: ఆన్లైన్ యూజర్లు, డేటా వినియోగం వేగంగా ఎదుగుతున్న నేపథ్యంలో 2020 నాటికి భారత ఇంటర్నెట్ ఎకానమీ 250 బిలియన్ డాలర్ల స్థాయికి (సుమారు రూ.16,25,000 కోట్లు) చేరనుంది. ప్రస్తుతం ఇది 100–130 బిలియన్ డాలర్ల (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 5 శాతం వాటా) స్థాయిలో ఉంది. ఈ–కామర్స్, ఆర్థిక సేవల ఊతంతో గణనీయంగా వృద్ధి చెంది 2020 నాటికల్లా ఇంటర్నెట్ ఎకానమీ 215–265 బిలియన్ డాలర్ల స్థాయికి (జీడీపీలో 7.5 శాతం) చేరవచ్చని కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ, ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టీఐఈ) సంయుక్తంగా రూపొందించిన ఒక నివేదికలో అంచనా వేశాయి. ఈ వృద్ధిలో .. ఈ–కామర్స్, ఆర్థిక సేవల వాటా 40–50 బిలియన్ డాలర్లు, ఈ–కామర్స్ ఉత్పత్తుల వాటా 45–50 బిలియన్ డాలర్లు, డిజిటల్ మీడియా .. అడ్వర్టైజింగ్ వాటా 5–8 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండనుంది. ఇందులో అత్యధికంగా ఇన్ఫ్రాపై ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల రూపంలో (50–60 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని నివేదిక వివరించింది. ఇక కనెక్టివిటీపరమైన వాటా 45–55 బిలియన్ డాలర్ల స్థాయిలో, డివైజ్‌ల వాటా 30–40 బిలియన్ డాలర్ల మేర ఉండగలదని పేర్కొంది. 65 కోట్లకు మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు .. నివేదిక ప్రకారం సుమారు 39.1 కోట్ల మంది యూజర్లతో భారత్ ఇప్పటికే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులపరంగా అంతర్జాతీయంగా రెండో స్థానంలో ఉంది. 2020 నాటికల్లా ఈ సంఖ్య 65 కోట్లకు చేరనుంది. అదే సమయంలో డేటా వినియోగం 10–14 రెట్లు పెరగనుంది. అప్పటికల్లా ప్రతి యూజరు డేటా వినియోగం సగటున నెలకు 7–10 జీబీ స్థాయికి చేరనుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ వాడకం పెరగడం వల్ల యూజర్లు ఆన్లైన్లో గడిపే సమయం కూడా 3–4 రెట్లు పెరిగిపోనుంది. 4జీ డివైజ్‌లు, విశ్వసనీయమైన హై స్పీడ్ డేటా, డిజిటల్ కంటెంట్ విస్తరణ మొదలైనవి భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుదలకు దోహదపడగలవని బీసీజీ పార్ట్నర్ నిమిష జైన్ తెలిపారు. -
ఆన్లైన్ బస్ బుకింగ్స్ జోరు
న్యూఢిల్లీ: ఆన్లైన్ బస్, హోటల్ బుకింగ్స్ జోరుగా పెరుగుతున్నాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్బీలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. జనవరిలో 2.5 లక్షలుగా ఉన్న బస్ బుకింగ్స్ జూలైలో 185 శాతం వృద్ధితో 7.2 లక్షలకు చేరాయని పేర్కొంది. హోటల్ బుకింగ్స్ 60,000 నుంచి 135 శాతం వృద్ధితో 1.3 లక్షలకు పెరిగాయని వివరించింది. గతంలో ఇంటర్నెట్ ద్వారా విమాన, రైల్వే టికెట్లు మాత్రమే బుక్ చేసేవారని, ఇప్పుడు బస్సు టికెట్లను కూడా ఆన్లైన్ ద్వారా బుక్ చేస్తున్నారని, ఇది ఇంటర్నెట్ విస్తరణకు అద్దం పడుతోందని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రే చెప్పారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోందని వివరించారు. మొబైల్ ఇంటర్నెట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.