న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బస్, హోటల్ బుకింగ్స్ జోరుగా పెరుగుతున్నాయని తాజాగా ఒక నివేదిక వెల్లడించింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బీలు సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. జనవరిలో 2.5 లక్షలుగా ఉన్న బస్ బుకింగ్స్ జూలైలో 185 శాతం వృద్ధితో 7.2 లక్షలకు చేరాయని పేర్కొంది.
హోటల్ బుకింగ్స్ 60,000 నుంచి 135 శాతం వృద్ధితో 1.3 లక్షలకు పెరిగాయని వివరించింది. గతంలో ఇంటర్నెట్ ద్వారా విమాన, రైల్వే టికెట్లు మాత్రమే బుక్ చేసేవారని, ఇప్పుడు బస్సు టికెట్లను కూడా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేస్తున్నారని, ఇది ఇంటర్నెట్ విస్తరణకు అద్దం పడుతోందని ఐఏఎంఏఐ ప్రెసిడెంట్ సుభో రే చెప్పారు. నగదురహిత లావాదేవీల నిర్వహణ చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతోందని వివరించారు. మొబైల్ ఇంటర్నెట్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.