ఐటీ రిటర్న్ దాఖలు..ఇలాగైతే ఈజీ! | ITR Form need to know the nomenclature | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్ దాఖలు..ఇలాగైతే ఈజీ!

Published Mon, Aug 3 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

ఐటీ రిటర్న్ దాఖలు..ఇలాగైతే ఈజీ!

ఐటీ రిటర్న్ దాఖలు..ఇలాగైతే ఈజీ!

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన గడువు ఇంకా నాలుగు వారాలే ఉంది. ప్రతి ఏటా రిటర్న్స్ దాఖలుకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ... గజిబిజి లెక్కలతో పన్నుల చెల్లింపుదారులకు గందరగోళం పెరుగుతుంది. చిన్నప్పుడు స్కూళ్లలో పైథాగరస్ థీరమ్స్, త్రికోణమితి లాంటి వాటి గురించి చెప్పారే తప్ప ఇలాంటి రోజువారీ అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించలేదే...? అన్న బాధ కూడా కలుగుతుంటుంది. ట్యాక్స్ ఫైలింగ్ చాలా సంక్లిష్టమైన ప్రక్రియలా కనిపిస్తుండటమే దీనికి కారణం. సులభంగా రిటర్న్స్ ఎలా దాఖలు చేయాలో తెలియజేసేదే ఈ కథనం...
 
 సాధారణంగా వేతన జీవులు పన్నుల రిటర్న్ దాఖలు ప్రక్రియను చూసుకోవాల్సింది ఆఫీసే కదా మన పనేమీ ఉండదులే అనుకుంటుంటారు. కానీ, మీకు ఇతరత్రా ఆదాయ మార్గాలేమైనా ఉన్నా... లేక వేరే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా వాటి గురించి వెల్లడించకపోతే ఆ మేరకు మీకు వచ్చే డిడక్షన్ ప్రయోజనాలను ఆఫీసులో కల్పించలేకపోవచ్చు. కనుక, మీ పన్ను రిటర్నుల విషయంలో మీరు స్వయంగా పాలుపంచుకుంటే పన్ను లెక్కలు, డిడక్షన్లు సరిగ్గా ఉండేలా చూసుకోవడం వీలవుతుంది. పన్ను పరిధిలోకి వచ్చేంత ఆదాయం ఉన్న వారంతా... వారికి పన్ను కోత పడినా, పడకపోయినా ట్యాక్స్ రిటర్న్‌లను దాఖలు చేయాల్సిందే.

 రిఫండ్‌కు ఈ వివరాలుండాలి...
 మీ ఆదాయం పన్ను పరిధిలోకి వచ్చినా... కొన్ని మినహాయింపుల వల్ల మీరు పన్నులు కట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయినప్పటికీ అదనంగా పన్ను ఏదైనా కట్ అయితే, దాన్ని తిరిగి పొందేందుకు (రిఫండ్) కూడా మీరు రిటర్న్ దాఖలు చేయాల్సి వస్తుంది. రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాక ఆదాయ పన్ను శాఖ అన్ని అంశాలు పరిశీలించి, సంతృప్తి చెందిన పక్షంలో డబ్బులు తిరిగిస్తుంది. రిఫండ్ కోసం ఈ-ఫైలింగ్ చేస్తున్నప్పుడు మీ బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు రిటర్న్ ఫారంలో తప్పులు లేకుండా పొందుపర్చాలి. మిగతావారికి ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఫైలింగ్ తప్పనిసరి అయినప్పటికీ.. ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లు వర్తించే 80 ఏళ్ల పైబడిన వారు మాత్రం పేపరు రూపంలో ఉండే దరఖాస్తును కూడా సమర్పించవచ్చు.

 ఈ ఫైలింగ్ కోసం..
 మీరు రిటర్నులను ఈ-ఫైలింగ్ చేశాక ఐటీ విభాగం మీకు ఐటీఆర్-వి ఫారంను ఈ-మెయిల్ చేస్తుంది. ఒక్క పేజీ ఉండే ఈ వెరిఫికేషన్ పత్రాన్ని మళ్లీ ఐటీ శాఖకు పంపిన తర్వాత మీ ఐటీ రిటర్ను ప్రాసెసింగ్ ప్రారంభమవుతుంది. నిర్ణీత 120 రోజుల్లోగా దీన్ని పంపించకపోతే మరోసారి రిటర్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్తగా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (ఈవీసీ) వ్యవస్థను ప్రవేశపెట్టాక.. అక్నాలెడ్జ్‌మెంట్ ఫారంను తప్పనిసరిగా పోస్టులో పంపాల్సిన అవసరం తప్పింది. ఈవీసీని ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్ లేదా ఆధార్ ఓటీపీ రూపంలో పొందటం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఆదాయ పన్ను శాఖ ఎంపిక చేసిన బ్యాంకుల్లో నెట్-బ్యాంకింగ్ ద్వారా కూడా ఈవీసీని పొందవచ్చు.

 ఇతర ఆదాయాలను తప్పనిసరిగా చెప్పాలి...
 పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ, ఫిక్సిడ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ, పెన్షను, కిసాన్ వికాస్ పత్రాలపై వచ్చే వడ్డీ, జాతీయ పొదుపు పత్రాలపై వచ్చే వడ్డీ మొదలైనవి.. ఇతరత్రా మార్గాల ద్వారా ఆదాయాల కింద పరిగణనలోకి వస్తాయి. కనుక, వీటన్నింటినీ గురించి కూడా తప్పకుండా పొందుపర్చి, అవసరమైన పన్నులను కట్టడం శ్రేయస్కరం.

 పన్ను ప్రయోజనాలిచ్చే సాధనాలపై దృష్టి..
 పన్నులపరమైన మినహాయింపు ప్రయోజనాలు అందించే కొన్ని పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, అయిదేళ్ల వ్యవధి ఉండే ఫిక్సిడ్ డిపాజిట్లు, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్‌లు, యులిప్స్, రియల్ ఎస్టేట్ మొదలైనవి ఈ కోవకి చెందినవే. రిస్కు సామర్థ్యాన్ని బట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్నుల భారాన్ని కొంత తగ్గించుకోవచ్చు.

 నివాస గృహంపైనా మినహాయింపులు..
 అద్దె ఇంట్లో ఉంటున్న వారు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ప్రయోజనాలు పొందేందుకు వీలుంటుంది. సొంత ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకున్న వారు కూడా నిర్దిష్ట నిబంధనలను బట్టి.. రుణంపై కట్టే వడ్డీ మీద డిడక్షన్ క్లెయిము చేసుకోవచ్చు.

 వైద్య బీమాపై డిడక్షన్లు..
 సెక్షన్ 80డీ కింద రూ. 40,000 దాకా (2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) మీ కుటుంబానికి తీసుకునే వైద్య బీమా పాలసీలతో పన్ను భారాన్ని త గ్గించుకోవచ్చు. సొంతానికి, జీవిత భాగస్వామికి, తమపైన ఆధారపడిన సంతానానికి సంబంధించి తీసుకునే పాలసీలు ఈ పరిధిలోకి వస్తాయి. తల్లిదండ్రులకు తీసుకునే మెడికల్ ఇన్సూరెన్స్‌పై కూడా డిడక్షన్ పొందవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్‌కు సంబంధించి రూ. 5,000 దాకా డిడక్షన్ వెసులుబాటు ఉంది.

 ఐటీఆర్ ఫారం పరిభాషను తెలుసుకోవాలి..
 ఆదాయమార్గాలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కో తరహా ఐటీఆర్ ఫారమ్ ద్వారా రిటర్నులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఆదాయ వనరులన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాక.. సరైన ఫారమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా సర్వీసులు అందించేందుకు ప్రత్యేక సంస్థలు, నిపుణులు కూడా ఉన్నారు. అవసరమైతే వారి సహాయం తీసుకోవచ్చు.
 
 రెండేళ్ల దాకా ఫైలింగ్ ..
 ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైలింగ్ చేయలేకపోతే.. రెండేళ్ల దాకా ఫైల్ చేసే వెసులుబాటు ఉంది. ఉదాహరణకు.. 2013-14 ఆర్థిక సంవత్సరపు రిటర్నుల దాఖలుకు 2014 జూలై 31 డెడ్‌లైన్. కానీ దీన్ని మిస్సయితే 2015 మార్చి 31 దాకా ఫైల్ చేయొచ్చు. అది కూడా వీలు కాకపోతే 2016 మార్చి 31 దాకా కూడా చేయొచ్చు. అయితే, ఇలా జాప్యం చేసినకొద్దీ పెనాల్టీలు పడతాయి. అంతే కాదు పన్నులేమైనా బకాయి ఉంటే వాటిపై వడ్డీ కూడా కట్టుకోవాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement