జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభం రూ.624 కోట్లు
జూన్ క్వార్టర్లో 44 శాతం క్షీణత
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు జూన్ త్రైమాసికంలో వ్యయాల సెగ తగిలింది. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 44 శాతం క్షీణించింది. రూ.624 కోట్ల లాభాన్ని కంపెనీ నమోదు చేయగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.1,120 కోట్లుగా ఉంది. స్టీల్ ఉత్పత్తి ఫ్లాట్‌గా ఉండడంతోపాటు, ఐరన్‌ఓర్, విద్యుత్ రూపేణా ఇన్‌పుట్ వ్యయాలు పెరిగిపోవడం లాభాలు తగ్గడానికి దారితీశాయి. ఆదాయం మాత్రం 24 శాతం వృద్ధితో రూ.15,977 కోట్లు నమోదైంది. వ్యయాలు 33 శాతం పెరిగి రూ.15,124 కోట్లకు చేరడం గమనార్హం.
స్టీల్ ఉత్పత్తి కేవలం ఒక శాతమే పెరిగి 3.91 మిలియన్ టన్నులుగా ఉంటే, స్టీల్ అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధి చెంది 3.51 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. జీఎస్టీకి మారే దశలో సరుకుల నిల్వలు తగ్గించుకోవడం వల్ల పరిశ్రమ వ్యాప్తంగా దేశీయ అమ్మకాలపై ప్రభావం ఉందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జేఎండీ శేషగిరిరావు తెలిపారు. ఉత్పత్తుల్లో వైవిధ్యంపై తమ దృష్టి కొనసాగుతుందని, విలువ జోడించిన ఉత్పత్తుల విక్రయాలు ఏటేటా 12 శాతం వృద్ధి చెందుతున్నట్టు ఆయన చెప్పారు. ఎగుమతులు జూన్ త్రైమాసికంలో 26 శాతం పెరిగినట్టు తెలిపారు.
డోల్వి, విజయ్‌నగర్ యూనిట్ల విస్తరణ కోసం ఏటా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. సొంతంగా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు, కంపెనీల కొనుగోళ్ల అవకాశాలతోనూ వృద్ధి చెందాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో స్టాక్ ధర 0.70 శాతం పెరిగి రూ.222.95 వద్ద క్లోజయింది.