సాకారమవుతున్న స్వప్నం | Ap Cm Ys Jagan Bhoomi Pooja For Jsw Steel Plant In Ysr District | Sakshi
Sakshi News home page

సాకారమవుతున్న స్వప్నం

Published Thu, Feb 16 2023 5:42 AM | Last Updated on Thu, Feb 16 2023 3:20 PM

Ap Cm Ys Jagan Bhoomi Pooja For Jsw Steel Plant In Ysr District - Sakshi

వైఎస్సార్‌ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌కు భూమి పూజ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌

సాక్షి ప్రతినిధి, కడప: ‘మనందరి చిరకాల స్వప్నం సాకారమౌతోంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మన ముంగిట్లోకి రానున్నాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేవుడి దయతో ఇవాళ వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. పెద్ద ఎత్తున జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో, వీలైనంత తక్కువ మందితో జరపాల్సి వచ్చిందన్నారు.

‘మమ్మల్ని కూడా పిలవండని కార్యకర్తలు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని అడుగుతున్నారు. కోడ్‌ అడ్డంకిగా ఉందన్న విషయాన్ని పెద్ద మనసుతో అర్థం  చేసుకోండి. ప్రతి అన్నకు, తమ్ముడికి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు’ అని చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ వస్తే ఆ ప్రాంతం ఏ విధంగా నగరంగా మారిపోతోందో గమనించామన్నారు.

విశాఖపట్నం తీసుకున్నా, కర్ణాటకలోని విజయనగర్‌ పక్కన జిందాల్‌ ఫ్యాక్టరీ చూసినా, ఇతర ప్రాంతాల్లోని స్టీల్‌ ప్లాంట్‌లను గమనించినా.. ఆయా ప్రాంతాలు అభివృద్ధి బాటలో పయనిస్తుండటం చూస్తున్నామన్నారు. ఇక్కడా అదే జరగాలి అని అప్పట్లో నాన్న గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కలలుకన్నారని, ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ కావాలని ఆలోచించారని చెప్పారు. ఆయన చనిపోయాక జిల్లాను ఏ నాయకుడూ పట్టించుకోనందున జిల్లా మొత్తం వెనుకబాటుకు గురవ్వడం మన కళ్లతో మనం చూశామన్నారు. దేవుడి ఆశీస్సులతో, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. మళ్లీ ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు రావడంతో మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అగ్రగామి జిందాల్‌ గ్రూపు 
– ఇక్కడ నిర్మించబోయే స్టీల్‌ ప్లాంట్‌ మరో 24–30 నెలల్లోపు ప్రారంభమవుతుంది. 3 మిలియన్‌ టన్నుల ప్లాంటును రెండు దశల్లో కట్టడానికి జిందాల్‌ కార్యాచరణ తయారు చేశారు. రూ.3,300 కోట్లతో మొదటి దశ పూర్తవుతుంది. ఆ తర్వాత రూ.5,500 కోట్లతో సెకండ్‌ ఫేజ్‌ మరో ఐదేళ్లలో అందుబాటులోకి వస్తుంది. మొత్తంగా రెండు దశల్లో రూ.8,800 కోట్లతో ఈ ప్రాంతంలో 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యమున్న స్టీల్‌ ప్లాంట్‌ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనుంది. 
– జిందాల్‌ గ్రూపు చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ 28.5 మిలియన్‌న్‌టన్నుల స్టీల్‌ సామర్థ్యంతో దాదాపు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులతో స్టీల్‌ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ 3 మిలియ¯Œన్‌ టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారు. 
– ఇది ఇక్కడితో ఆగిపోదు. బళ్లారిలో కూడా జిందాల్‌ గ్రూపు స్టీల్‌ ప్లాంట్‌ మొదలు పెట్టినప్పుడు 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యం అనే చెప్పారు. ఇవాళ అది పెరుగుతూ వచ్చి.. 13 మిలియ¯Œన్‌ టన్నుల ప్లాంట్‌గా సామర్థ్యం పెంచుకోవడంతో ఆ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను.

రూ.700 కోట్లతో మౌలిక సదుపాయాలు
– ఈ ప్రాంతం సముద్ర తీరానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ ప్లాంట్‌ కోసం ఇక్కడ మిగిలి ఉన్న భూములను రూ.40 కోట్లతో కొనుగోలు చేసి.. దాదాపు 3,500 ఎకరాలు జిందాల్‌ ఫ్యాక్టరీకి ఇస్తున్నాం. 

– ఇక్కడ జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీతోపాటు పక్కన అనుబంధ పరిశ్రమల వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ఫలితంగా ఇక్కడో స్టీల్‌ సిటీ ఆవిర్భవిస్తుందన్న ఉద్దేశంతో గొప్పగా అడుగులు వేస్తున్నాం. ఈ ప్లాంట్‌కు సంబంధించి 67వ నంబరు జాతీయ రహదారిని కలుపుతూ.. ఏడున్నర కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రోడ్డు వేస్తున్నాం. ప్రొద్దుటూరు, ఎరగ్రుంట రైల్వే లైను కోసం కొత్తగా మరో పది కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం కూడా జరుగుతుంది.

– ఈ ప్లాంట్‌ కోసం గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేక పైపులై¯Œన్‌ చేపడుతున్నాం. నిరంతరంగా విద్యుత్‌ సరఫరా కోసం తలమంచిపట్నం సబ్‌స్టేషన్‌న్‌నుంచి ప్రత్యేకంగా 220 కేవీ లై¯Œన్‌ నిర్మిస్తున్నాం. ఇలా మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్లాంట్‌ వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.

అపారంగా ఉద్యోగావకాశాలు 
– జిల్లాలో ఇప్పటికే కొప్పర్తిలో 550 ఎకరాలు కేటాయించి.. ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ)ను తీసుకొచ్చాం. ఇక్కడకు దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తున్నాయి. ఆ 550 ఎకరాల్లో మొత్తం పరిశ్రమలు వస్తే.. మొత్తంగా లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి. 
– ఇప్పటికే అక్కడ రూ.1,100 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 11,500 మందికి ఉద్యోగాలకు సంబంధించిన కార్యాచరణ కూడా వేగంగా జరుగుతోంది. అదే కొప్పర్తిలో జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ పేరుతో 3,155 ఎకరాలను కేటాయించి.. అడుగులు ముందుకు వేస్తున్నాం. అక్కడ రూ.18 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చే అవకాశాలు సృష్టిస్తున్నాం. తద్వారా అపారంగా.. 1.75 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది.  

– చదువుకున్న ప్రతి పిల్లాడికి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావాలన్న తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మీ బిడ్డ ప్రభుత్వం ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చింది. 

పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలం
– గడిచిన మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో దేశంలోనే నంబర్‌ వ¯Œన్‌ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. 2019 నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రాలకు ర్యాంకింగ్‌ ఇచ్చే ముందు పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల స్థాపనకు చేస్తున్న కృషితో పాటు పారిశ్రామికవేత్తలు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ వల్లే మేము ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాం. 

– 2021–22లో 11.43 శాతం గ్రోత్‌ రేటుతో ఏపీ దేశంలోనే వేగవంతమైన గ్రోత్‌ రేటు గల రాష్ట్రంగా కూడా మొదటి స్థానంలో నిలిచింది. ఈ రెండు అంశాల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఎంత అనుకూలమో స్పష్టంగా తెలుస్తోంది.

–     మీకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలోనే అందుబాటులో ఉంటాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ సమస్యను పరిష్కరిస్తుంది. ఇక్కడకు వస్తున్న పెట్టుబడులను మనసారా ఆహ్వానిస్తూ.. పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను.  

అభివృద్ధిలో వెనుకబడిన ఈ ప్రాంతంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు ద్వారా ఈ జిల్లా ముఖచిత్రం మారిపోనుంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఒక ఆశ కల్పించిన సజ్జన్‌ జిందాల్‌కు ధన్యవాదాలు. రూ.8,800 కోట్ల పెట్టుబడితో ఆగిపోకుండా మిగిలిన గ్రీన్‌ హైడ్రోజన్, సోలార్, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల దిశగా కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాం. ఈ రంగంలో దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌గా, అత్యంత వేగవంతమైన గ్రోత్‌ రేటు కలిగిన రాష్ట్రంగా పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని పారిశ్రామికవేత్తలందరూ గమనించాలి. 
– సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement