vijaynagar
-
జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లాభం రూ.624 కోట్లు
జూన్ క్వార్టర్లో 44 శాతం క్షీణత న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు జూన్ త్రైమాసికంలో వ్యయాల సెగ తగిలింది. కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 44 శాతం క్షీణించింది. రూ.624 కోట్ల లాభాన్ని కంపెనీ నమోదు చేయగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.1,120 కోట్లుగా ఉంది. స్టీల్ ఉత్పత్తి ఫ్లాట్‌గా ఉండడంతోపాటు, ఐరన్‌ఓర్, విద్యుత్ రూపేణా ఇన్పుట్ వ్యయాలు పెరిగిపోవడం లాభాలు తగ్గడానికి దారితీశాయి. ఆదాయం మాత్రం 24 శాతం వృద్ధితో రూ.15,977 కోట్లు నమోదైంది. వ్యయాలు 33 శాతం పెరిగి రూ.15,124 కోట్లకు చేరడం గమనార్హం. స్టీల్ ఉత్పత్తి కేవలం ఒక శాతమే పెరిగి 3.91 మిలియన్ టన్నులుగా ఉంటే, స్టీల్ అమ్మకాలు మాత్రం 5 శాతం వృద్ధి చెంది 3.51 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. జీఎస్టీకి మారే దశలో సరుకుల నిల్వలు తగ్గించుకోవడం వల్ల పరిశ్రమ వ్యాప్తంగా దేశీయ అమ్మకాలపై ప్రభావం ఉందని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ జేఎండీ శేషగిరిరావు తెలిపారు. ఉత్పత్తుల్లో వైవిధ్యంపై తమ దృష్టి కొనసాగుతుందని, విలువ జోడించిన ఉత్పత్తుల విక్రయాలు ఏటేటా 12 శాతం వృద్ధి చెందుతున్నట్టు ఆయన చెప్పారు. ఎగుమతులు జూన్ త్రైమాసికంలో 26 శాతం పెరిగినట్టు తెలిపారు. డోల్వి, విజయ్‌నగర్ యూనిట్ల విస్తరణ కోసం ఏటా రూ.8,000 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. సొంతంగా 5 మిలియన్ టన్నుల ఉత్పత్తిని పెంచుకోవడంతోపాటు, కంపెనీల కొనుగోళ్ల అవకాశాలతోనూ వృద్ధి చెందాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో స్టాక్ ధర 0.70 శాతం పెరిగి రూ.222.95 వద్ద క్లోజయింది. -
ఈ విజయ్‌నగర్‌లో కిలో ఉప్పు రూ. 150
హిమాలయ పర్వత సానువుల మధ్య పచ్చని పచ్చిక బయళ్ల మధ్య తీర్చిదిద్దినట్లున్న ఈ గ్రామంలో కిలో ఉప్పు ధర 150 రూపాయలు, కిలో చెక్కర ధర 200 రూపాయలు. ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన ఈ గ్రామంలో 300 రిటైర్డ్ సైనిక కుటుంబాలు ఉన్నాయి. భారత్, మయన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామం పేరు విజయ్‌నగర్. 1961లో అప్పటి అస్సాం రైఫిల్స్ ఇనిస్పెక్టర్ జనరల్, మేజరల్ జనరల్ ఏఎస్ గౌర్య నాయకత్వాన ‘శ్రీజిత్–2’ పేరిట అస్సాం రైఫిల్స్ నిర్వహించిన సాహస యాత్రలో ఈ గ్రామ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం నివాసయోగ్యంగా కనిపించడంతో పదవి విరమణ చేసిన అస్సాం రైఫిల్స్‌కు ఇక్కడే వసతి కల్పించారు. ఏ ఏస్ గౌర్య తన కుమారుడు విజయ్ పేరు వచ్చేలా ఈ గ్రామానికి విజయ్‌నగర్ అని పెట్టారు. ఈ గ్రామం వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అసలు రహదారులే లేవు. దట్టమైన అడవి గుండా కాలి నడకనే రావాలి. అందుకు తొమ్మిది, పది రోజులు పడుతుంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మినహా ఎలాంటి విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. ప్రాథమిక పాఠశాలలో కూడా నెలకు ఓ విద్యార్థి వద్ద 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అతి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలంటే 200 కిలోమీటర్లు. హెలికాప్టర్లో తప్ప ఆ ఆస్పత్రికి వెళ్లలేరు. గ్రామంలో ఎవరూ జబ్బుపడ్డ అంతే సంగతులు. స్థానిక చెట్ల పసర్లతో తగ్గితే తగ్గాలి. లేదంటే లేదు. 1972లో భారత్–మయన్మార్ సరిహద్దులను అధికారికంగా గుర్తించక ముందే ఈ గ్రామం ఏర్పడింది. సరిహద్దుకు రక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే రిటైర్డ్ అస్సాం రైఫిల్స్ కుటుంబాలకు ఇక్కడ వసతి కల్పించారు. సరిహద్దులు ఖరారయినప్పుడు ఈ గ్రామస్థులందరికి అన్ని వసతులు కల్పిస్తామని, విద్యావైద్య, రవాణా సౌకర్యాలతోపాటు వ్యవసాయానికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక్క ఉప్పు, చెక్కరే కాదు, ఈ గ్రామంలో పప్పు, బెల్లం నుంచి నూనెల వరకు అన్నీ ఆకాశాన్నంటే ధరలేనని 80 ఏళ్ల ఎక్స్ సర్వీస్మేన్ జెడ్ రాల్టే తెలిపారు. వచ్చే పింఛను డబ్బులతో సరకులు కొనలేకపోతున్నామని, ప్రభుత్వమే ఏదో ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.