ఈ విజయ్‌నగర్‌లో కిలో ఉప్పు రూ. 150
హిమాలయ పర్వత సానువుల మధ్య పచ్చని పచ్చిక బయళ్ల మధ్య తీర్చిదిద్దినట్లున్న ఈ గ్రామంలో కిలో ఉప్పు ధర 150 రూపాయలు, కిలో చెక్కర ధర 200 రూపాయలు. ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన ఈ గ్రామంలో 300 రిటైర్డ్ సైనిక కుటుంబాలు ఉన్నాయి. భారత్, మయన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామం పేరు విజయ్‌నగర్.
1961లో అప్పటి అస్సాం రైఫిల్స్ ఇనిస్పెక్టర్ జనరల్, మేజరల్ జనరల్ ఏఎస్ గౌర్య నాయకత్వాన ‘శ్రీజిత్–2’ పేరిట అస్సాం రైఫిల్స్ నిర్వహించిన సాహస యాత్రలో ఈ గ్రామ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం నివాసయోగ్యంగా కనిపించడంతో పదవి విరమణ చేసిన అస్సాం రైఫిల్స్‌కు ఇక్కడే వసతి కల్పించారు. ఏ ఏస్ గౌర్య తన కుమారుడు విజయ్ పేరు వచ్చేలా ఈ గ్రామానికి విజయ్‌నగర్ అని పెట్టారు. ఈ గ్రామం వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అసలు రహదారులే లేవు. దట్టమైన అడవి గుండా కాలి నడకనే రావాలి. అందుకు తొమ్మిది, పది రోజులు పడుతుంది.
ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మినహా ఎలాంటి విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. ప్రాథమిక పాఠశాలలో కూడా నెలకు ఓ విద్యార్థి వద్ద 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అతి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలంటే 200 కిలోమీటర్లు. హెలికాప్టర్‌లో తప్ప ఆ ఆస్పత్రికి వెళ్లలేరు. గ్రామంలో ఎవరూ జబ్బుపడ్డ అంతే సంగతులు. స్థానిక చెట్ల పసర్లతో తగ్గితే తగ్గాలి. లేదంటే లేదు. 1972లో భారత్–మయన్మార్ సరిహద్దులను అధికారికంగా గుర్తించక ముందే ఈ గ్రామం ఏర్పడింది. సరిహద్దుకు రక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే రిటైర్డ్ అస్సాం రైఫిల్స్ కుటుంబాలకు ఇక్కడ వసతి కల్పించారు.
సరిహద్దులు ఖరారయినప్పుడు ఈ గ్రామస్థులందరికి అన్ని వసతులు కల్పిస్తామని, విద్యావైద్య, రవాణా సౌకర్యాలతోపాటు వ్యవసాయానికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక్క ఉప్పు, చెక్కరే కాదు, ఈ గ్రామంలో పప్పు, బెల్లం నుంచి నూనెల వరకు అన్నీ ఆకాశాన్నంటే ధరలేనని 80 ఏళ్ల ఎక్స్ సర్వీస్‌మేన్ జెడ్ రాల్టే తెలిపారు. వచ్చే పింఛను డబ్బులతో సరకులు కొనలేకపోతున్నామని, ప్రభుత్వమే ఏదో ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.