india-myanmar
-
భారత్–మయన్మార్ సరిహద్దుల్లో స్వేచ్ఛా సంచారం బంద్
న్యూఢిల్లీ: భారత్–మయన్మార్ మధ్య ఫ్రీం మూమెంట్ రెజీమ్(ఎంఎంఆర్)ను రద్దు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. దేశ అంతర్గత భద్రత, ఈశాన్య రాష్ట్రాల జనాభా నిర్మాణ పరిరక్షణ కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ హోం శాఖ అందజేసిన ప్రతిపాదనపై అంతర్గత వ్యవహారాల విభాగం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా చెప్పారు. ఎఫ్ఎంఆర్ ఫలితంగా రెండు దేశాల సరిహద్దుల్లోని 16 కిలోమీటర్ల భూభాగంలో ఎటువంటి పత్రాలు అవసరం లేకుండా సంచరించే వెసులుబాటు ఉంది. భారత్–మయన్మార్లు సుమారు 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉన్నాయి. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి తీసుకువచ్చిన ఎఫ్ఎంఆర్ విధానం ప్రస్తుతం మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అమల్లో ఉంది. సరిహద్దుల్లో కంచె నిర్మించాలంటూ ఇంఫాల్ లోయలో ఉండే మైతీలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌ఎంఆర్‌ను అవకాశంగా తీసుకుని ఉగ్రవాదులు దేశంలోకి యథేచ్ఛగా ప్రవేశిస్తున్నారని, డ్రగ్స్ వ్యాపారం సాగుతోందని వారు ఆరోపిస్తున్నారు. -
మయన్మార్ సరిహద్దుల్లో కంచె
గువాహటి: భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మయన్మార్‌తో సరిహద్దులకు కూడా పూర్తి స్థాయిలో ముళ్ల కంచె నిర్మిస్తామని చెప్పారు. రెండు దేశాల సరిహద్దుల్లో ప్రజలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటును సైతం రద్దు చేసేందుకు యోచిస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. భారత్ –మయన్మార్ మధ్య అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంల రాష్ట్రాల మీదుగా 1,643 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుంది. యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా 2018 నుంచి సరిహద్దులకు ఇరువైపులా 16 కిలోమీటర్ల దూరం వరకు వీసా లేకుండా ప్రజలు సంచరించేందుకు కేంద్రం వీలు కలి్పంచింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని మయన్మార్‌కు చెందిన వేలాది మంది భారత భూభాగంలో అక్రమంగా నివాసం ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమిత్ షా ప్రకటనతో అక్రమ చొరబాట్లతో ఇక చెక్ పడనుంది. శనివారం అమిత్ షా అయిదు అస్సాం పోలీస్ కమాండో బెటాలియన్ల మొదటి బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్‌నుద్దేశించి, ఆ తర్వాత సలోనిబారిలో సశస్త్ర సీమాబల్ 60వ అవతరణ దినోత్సవంలో మాట్లాడారు. సరిహద్దులను కాపాడటంతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా తమ విధులను ఎస్ఎస్బీ, ఇతర కేంద్ర బలగాలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాయని కొనియాడారు. ప్రధాని మోదీ హయాంలో పదేళ్లలో దేశంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు సంధించారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగాలు రావాలంటే యువత లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, నేడు బీజేపీ పాలనలో ఉద్యోగాల కోసం ఒక్క పైసా కూడా ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్టపై ఆయన..దాదాపు 550 ఏళ్ల తర్వాత రామ్ లల్లా తిరిగి అయోధ్యకు రావడం యావత్ దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. మూడేళ్లలో దేశంలో నక్సల్స్ ఉనికి లేకుండా చేస్తామని చెప్పారు. -
ఈ విజయ్‌నగర్‌లో కిలో ఉప్పు రూ. 150
హిమాలయ పర్వత సానువుల మధ్య పచ్చని పచ్చిక బయళ్ల మధ్య తీర్చిదిద్దినట్లున్న ఈ గ్రామంలో కిలో ఉప్పు ధర 150 రూపాయలు, కిలో చెక్కర ధర 200 రూపాయలు. ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వెలసిన ఈ గ్రామంలో 300 రిటైర్డ్ సైనిక కుటుంబాలు ఉన్నాయి. భారత్, మయన్మార్ సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ గ్రామం పేరు విజయ్‌నగర్. 1961లో అప్పటి అస్సాం రైఫిల్స్ ఇనిస్పెక్టర్ జనరల్, మేజరల్ జనరల్ ఏఎస్ గౌర్య నాయకత్వాన ‘శ్రీజిత్–2’ పేరిట అస్సాం రైఫిల్స్ నిర్వహించిన సాహస యాత్రలో ఈ గ్రామ ప్రాంతాన్ని కనుగొన్నారు. ఈ ప్రాంతం నివాసయోగ్యంగా కనిపించడంతో పదవి విరమణ చేసిన అస్సాం రైఫిల్స్‌కు ఇక్కడే వసతి కల్పించారు. ఏ ఏస్ గౌర్య తన కుమారుడు విజయ్ పేరు వచ్చేలా ఈ గ్రామానికి విజయ్‌నగర్ అని పెట్టారు. ఈ గ్రామం వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. అసలు రహదారులే లేవు. దట్టమైన అడవి గుండా కాలి నడకనే రావాలి. అందుకు తొమ్మిది, పది రోజులు పడుతుంది. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మినహా ఎలాంటి విద్యా, వైద్య సౌకర్యాలు లేవు. ప్రాథమిక పాఠశాలలో కూడా నెలకు ఓ విద్యార్థి వద్ద 500 రూపాయలు ఫీజు వసూలు చేస్తారు. అతి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలంటే 200 కిలోమీటర్లు. హెలికాప్టర్లో తప్ప ఆ ఆస్పత్రికి వెళ్లలేరు. గ్రామంలో ఎవరూ జబ్బుపడ్డ అంతే సంగతులు. స్థానిక చెట్ల పసర్లతో తగ్గితే తగ్గాలి. లేదంటే లేదు. 1972లో భారత్–మయన్మార్ సరిహద్దులను అధికారికంగా గుర్తించక ముందే ఈ గ్రామం ఏర్పడింది. సరిహద్దుకు రక్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే రిటైర్డ్ అస్సాం రైఫిల్స్ కుటుంబాలకు ఇక్కడ వసతి కల్పించారు. సరిహద్దులు ఖరారయినప్పుడు ఈ గ్రామస్థులందరికి అన్ని వసతులు కల్పిస్తామని, విద్యావైద్య, రవాణా సౌకర్యాలతోపాటు వ్యవసాయానికి కావాల్సినంత భూమిని కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఒక్క ఉప్పు, చెక్కరే కాదు, ఈ గ్రామంలో పప్పు, బెల్లం నుంచి నూనెల వరకు అన్నీ ఆకాశాన్నంటే ధరలేనని 80 ఏళ్ల ఎక్స్ సర్వీస్మేన్ జెడ్ రాల్టే తెలిపారు. వచ్చే పింఛను డబ్బులతో సరకులు కొనలేకపోతున్నామని, ప్రభుత్వమే ఏదో ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.