
విజయ్ మాల్యా (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : భారతీయ బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా బ్రిటన్ కోర్టు జారీచేసిన ఆదేశాలపై స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరిజిత్ బసు సంతోషం వ్యక్తం చేశారు. మాల్యాకు వ్యతిరేకంగా యూకే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము చాలా సంతోషంగా ఉన్నామని, తమ బకాయిలన్నింటిన్నీ మాల్యా వద్ద నుంచి రికవరీ చేసుకుంటామని చెప్పారు. బ్యాంకులు, యూకే అథారిటీలతో కలిసి పనిచేస్తాయన్నారు. బకాయిల్లో ఎంత మొత్తాన్ని రికవరీ చేస్తారో ప్రకటించనప్పటికీ, తమ బకాయిడిన నగదులో ఎక్కువ భాగమే రికవరీ చేపడతామని తెలిపారు.
తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్ హైకోర్టు జడ్జి ఈ మేరకు సానుకూల ఉత్తర్వులు జారీ చేసింది. లండన్ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్ షైర్‌లో ఉన్న మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి, ఆయన ఏజెంట్లకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ‘‘హైకోర్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి, ఆయన అధికార పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్ ఎవరైనా లేడీవాక్, బ్రాంబిల్ లాడ్జ్‌లోని అన్ని భవనాల్లోకి ప్రవేశించి సోదాలు చేసేందుకు, మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు అనుమతిస్తున్నట్టు’’ జస్టిస్ బిరాన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.మాల్యాకు చెందిన దేశీయ ఆస్తుల వేలంతో రూ.963 కోట్లను రికవరీ చేసుకున్నామని బసు చెప్పారు. ఎస్‌బీఐ మాల్యా కేసులో 13 బ్యాంకులకు కన్సార్టియంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment