
జోరు తగ్గిన రిటైల్
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా రిటైల్ వ్యాపారంలో జోరు తగ్గింది. నిర్మాణాల్లో జాప్యం కారణంగా ఏడు ప్రధాన నగరాల్లోని షాపింగ్ మాల్స్‌లో రిటైల్ విస్తీర్ణం 79 శాతం మేర అంటే 10 లక్షల చ.అ. తగ్గిందని అమెరికా ప్రాపర్టీ కన్సల్టెన్సీ కంపెనీ సీబీఆర్‌ఈ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే సరఫరా తగ్గటంతో ఉన్న షాపుల అద్దెలు మాత్రం స్వల్పంగా పెరిగాయని తెలిపింది. 2013లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణే నగరాల్లో రిటైల్ విస్తీర్ణం 4.7 మిలియన్ చ.అ.గా ఉంది.
హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులోని కొన్ని ప్రముఖ రిటైల్ ప్రాజెక్ట్‌లు గతేడాది చివరకు పూర్తి అవుతాయని భావించినప్పటికీ నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా ఇప్పటికీ పూర్తి కాలేదని సీబీఆర్‌ఈ నివేదిక వెల్లడించింది. స్థిరాస్తి రంగంలో వృద్ధి తగ్గడం, పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేయని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కొనుగోళ్లు మందగించడం వంటివి కారణంగా పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది దేశంలో బ్రూక్స్ బ్రదర్స్, స్టార్‌బక్స్, మైకెల్ కోర్స్, బర్గర్ కంపెనీ తదితర జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పింది. షియోమి, పేపర్ డాల్స్, బర్టన్ తదితర కంపెనీలు దేశీయ ఆన్‌లైన్ దిగ్గజాలతో కలసి వ్యాపారం చేయటంతో ఆన్‌లైన్ రిటైల్ విస్తీర్ణం బాగా పెరిగిందని నివేదిక చెబుతోంది.