రెనో 800 సీసీ కారు వస్తోంది..
2 నెలల్లో భారత్‌లో విడుదల!
- ధర రూ.2.5-4 లక్షల మధ్య
- ఈ నెలలోనే లాడ్జీ ఎంపీవీ మార్కెట్లోకి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ రంగంలో ఉన్న ఫ్రాన్స్ కంపెనీ రెనో.. భారత్‌లో సామాన్యుడికీ దగ్గరయ్యేందుకు రెడీ అవుతోంది. 800 సీసీ కారును ఈ ఏడాది మే నాటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. చైన్నై సమీపంలోని ఒరగడం వద్ద ఉన్న రెనో నిస్సాన్‌ల సంయుక్త ప్లాంటులో ఎక్స్‌బీఏ కోడ్ పేరుతో ఈ ఎంట్రీ లెవెల్ మోడల్ సిద్ధమవుతోంది. చిన్న కార్ల తయారీకై ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే భారతీయ రోడ్లపై దీనిని పరీక్షిస్తున్నారు కూడా.
ఇక కారు ధర వేరియంట్‌నుబట్టి రూ.2.5-4 లక్షల మధ్య ఉండనుంది. ప్రపంచవ్యాప్తంగా రెనో నుంచి తక్కువ ఖరీదున్న కారు ఇదే కావడం విశేషం. రెనో ఎక్స్‌బీఏ గ్లోబల్ ప్రొడక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెట్టనున్నారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియాలోని ఇతర దేశాల్లోనూ దీనిని పరిచయం చేయనున్నారు.
నిస్సాన్ సైతం..
రెనో ఎక్స్‌బీఏ కోడ్ కారు 800 సీసీ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందుతోంది. నిస్సాన్ సైతం ఇదే ఇంజన్‌పై భవిష్యత్‌లో తన అనుబంధ బ్రాండ్ అయిన డాట్సన్ ద్వారా చిన్న కారును ప్రవేశపెట్టనుంది. అయితే రెండు కార్ల మధ్య డిజైన్‌లో చాలా తేడాలుంటాయని ఇరు కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం డాట్సన్ విక్రయిస్తున్న డాట్సన్ గో, డాట్సన్ గో ప్లస్ మోడళ్లు రెండూ కూడా 1,198 సీసీ ఇంజన్ సామర్థ్యం గలవి. డాట్సన్ గో ధర హైదరాబాద్ ఎక్స్ షోరూంలో వేరియంట్‌నుబట్టి రూ.3.29 లక్షల నుంచి ప్రారంభం. కాగా, రూ.4 లక్షలలోపు ఖరీదున్న కారును ఆవిష్కరించేందుకు రెనో నిస్సాన్ అలయన్స్ చైర్మన్, సీఈవో కార్లోస్ గోసన్ మే నెలలో భారత్‌కు వస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. మే నెలలో విడుదలయ్యే మోడల్, అలాగే 800 సీసీ కారు ఒకటేనా అన్నది కంపెనీ ఇప్పటికీ స్పష్టం చేయకపోవడం కొసమెరుపు.
ఎంపీవీ ఈ నెలలోనే..
మల్టీ పర్పస్ వెహికిల్ ‘లాడ్జీ’ మార్చి చివరికల్లా భారత్‌లో అడుగు పెడుతోంది. ఆ తర్వాత రూ.4 లక్షలలోపు ధర గల కారును తీసుకొస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమీత్ సాహ్నే తెలిపారు. ఈ రెండు కార్లతో కంపెనీ మార్కెట్ వాటా రెండేళ్లలో రెండింతలై 5 శాతంపైగా నమోదు చేస్తుందని కంపెనీ ఆశాభావంతో ఉంది. పాత కార్ల విక్రయ విభాగంలోకి రెనో ప్రవేశిస్తోంది. అన్ని కంపెనీల పాత కార్లను విక్రయించనున్నారు.