రెనో క్విడ్, డాట్సన్ రెడీ గో కార్ల రీకాల్
• ఇంధన వ్యవస్థలో లోపాలు
• సరిదిద్దడానికి చర్యలు...
• 51 వేల కార్లను రీకాల్ చేస్తున్న
• రెనో నిస్సాన్... 932 కార్లు
న్యూఢిల్లీ: వాహన కంపెనీ భారత్‌లో 50 వేలకు పైగా రెనో క్విడ్ కార్లను రీకాల్ చేస్తోంది. మరో వాహన కంపెనీ నిస్సాన్ డాట్సన్ రెడీ గో మోడల్‌లో 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఇంధన వ్యవస్థలో లోపాలను సరిచేయడానికి, హోస్ క్లిప్‌ను జత చేయడానికి ఈ కార్లను రీకాల్ చేస్తున్నామని రెండు కంపెనీలు పేర్కొన్నాయి. 2015, అక్టోబర్ నుంచి ఈ ఏడాది మే 18 వరకూ తయారైన క్విడ్ (800 సీసీ) ఎల్ వేరియంట్లలో స్వచ్ఛంద తనిఖీలు నిర్వహిస్తున్నామని రెనో కంపెనీ తెలిపింది. ఇంధన వ్యవస్థలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంధన వ్యవస్థను తనిఖీ చేస్తున్నామని, ఫ్యూయల్ హోస్ క్లిప్‌ను జత చేస్తున్నామని వివరించింది.
ఈ సమస్యలున్న కార్లను ఉచితంగా తనిఖీ చేస్తామని, ఏమైనా అవసరమైన చర్యలుంటే తీసుకుంటామని పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేసిన యజమానులను సంప్రదిస్తున్నామని, తనిఖీ కోసం కార్లను డీలర్ల వద్దకు తీసుకురావలసిందిగా కోరుతున్నామని వివరించింది. కాగా రీకాల్ కార్లలో 10 శాతం కార్లలో మాత్రమే ఈ సమస్యలున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన క్విడ్ 800 సీసీ కార్లను రూ.2.64-3.95 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో విక్రయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 56 వేల క్విడ్ కార్లను రెనో విక్రయించింది.
మరోవైపు నిస్సాన్ కంపెనీ డాట్సన్ రెడీ గో మోడల్‌లో లోపాలున్న ఇంధన వ్యవస్థను సరిదిద్దడానికి 932 కార్లను రీకాల్ చేస్తోంది. ఈ ఏడాది మే 18 వరకూ తయారైన కొన్ని కార్లలో ఈ లోపాలున్న కార్లను గుర్తించామని తెలిపింది. ఈ మోడల్ కార్లు ఇప్పటివరకూ 14వేలు అమ్ముడయ్యాయి. క్విడ్, డాట్సన్ రెడీ గో కార్లు సీఎంఎఫ్‌ఏ ప్లాట్‌ఫార్మ్‌పై చెన్నై ప్లాంట్‌లోనే తయారయ్యాయి.