ఈ ఏడాది కాస్త బాగుంటుంది.. | sakshi interview with zenmoney JMD Satish kanteti | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది కాస్త బాగుంటుంది..

Published Tue, Nov 17 2015 2:35 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

ఈ ఏడాది కాస్త బాగుంటుంది.. - Sakshi

ఈ ఏడాది కాస్త బాగుంటుంది..

జెన్‌మనీ జేఎండీ సతీష్ కంతేటి
స్వల్పకాలానికి బలహీనంగానే మార్కెట్లు
* మూడేళ్ల దృష్టితో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి...
* సంస్కరిస్తున్న రంగాల కంపెనీలు
* పెట్టుబడులకు అనుకూలం...
 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లలో స్థిరత్వం కష్టమైపోతోంది. ఒకరోజు పెరిగితే మరో రెండ్రోజులు తగ్గుతున్నాయి. రెండ్రోజులు పెరిగితే మళ్లీ ఆ వెంటనే తగ్గుతున్నాయి. మరి మున్ముందు ఎలా ఉంటాయి? ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఈ విషయమై జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటిని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో కొన్ని ప్రశ్నలడిగింది. ఆ ఇంటర్వ్యూ సంక్షిప్తంగా...

కొన్నాళ్లుగా దేశీయ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణాలేంటి?
గడిచిన ఏడాది కాలంలో దేశీయ సూచీలు సుమారు 5 శాతం నష్టపోయాయి. దీనికి అనేక కారణాలు చెప్పొచ్చు. ప్రధానంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా వృద్ధి చెందలేదు. అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదించడం, ఆర్థిక సంస్కరణలు వేగం పుజుకోకపోవడం, కరువు, బ్యాంకుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు, ప్రైవేటు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఒత్తిడి ఎదుర్కోవడం వంటివన్నీ కలసి స్టాక్ సూచీలను ప్రభావితం చేశాయి. దీనికి తోడు అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు ఇండియాతో సహా అన్ని వర్థమాన దేశాలనూ వెంటాడుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్‌ఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క దిగువ స్థాయిలో దేశీయ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను కొనుగోళ్లు చేస్తూ మార్కెట్‌కు మద్దతునిస్తున్నారు.
 
వచ్చే ఏడాది కాలంలో స్టాక్ సూచీల కదలికలు ఎలా ఉండొ చ్చని భావిస్తున్నారు.?
స్వల్పకాలానికి మార్కెట్లు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. రానున్న నెలల్లో అమెరికా వడ్డీరేట్లను పెంచడం మొదలుపెడితే ఈ బలహీనత మరింత పెరగొచ్చు. కాకపోతే ఇదే సమయంలో దేశీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వృద్ధిరేటును ప్రోత్సహించేలా ఉన్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించడం, ఇన్‌ఫ్రాకు పెట్టుబడులు పెంచడం, ఎఫ్‌డీఐ పాలసీల్లో సంస్కరణలు, విద్యుత్ డిస్కంలు, హైవే ప్రాజెక్టుల్లో చేపడుతున్న చర్యలు బ్యాంకుల ఎన్‌పీఏలను తగ్గించేవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక వృద్ధిరేటును పెంచుతాయి.

కానీ.. వరుసగా వస్తున్న కరువు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశముంది. మొత్తమ్మీద చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది మార్కెట్ల పని తీరు బాగుంటుందని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్థిరంగా ఉంటేనే దేశీయ సూచీలు లాభాలను అందించగలవు.
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏయే రంగాలు అనుకూలంగా కనబడుతున్నాయి?
కేంద్రం సంస్కరణలు చేపడుతున్న రంగాలు ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ, విద్యుత్, విద్యుత్ పంపిణీ - సరఫరా, ఫుడ్ ప్రోసెసింగ్, ఐటీ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థతో నేరుగా ముడిపడి ఉన్న రంగాలే.
 
స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చా?
ప్రస్తుత మార్కెట్లు స్వల్ప కాలానికి అనుకూలంగా లేవు. కనీసం మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడమే ఇపుడు ఉత్తమం. అలా కాకుండా నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం రుణ భారం తక్కువగా ఉండి, అధిక డివిడెండ్లు ఇచ్చే కంపెనీలు, అందులో షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవాలి.
 
దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏమైనా షేర్లను సూచిస్తారా?

మూడేళ్ల కాలపరిమితితో ఎం అండ్ ఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement