రాణించిన రిలయన్స్, ఐటీసీ, ఎస్‌బీఐ
ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్(1.25%), ఐటీసీ(1.50%), ఎస్‌బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
యూరప్ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్‌లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్‌లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది.
రెండు నెలల కనిష్టానికి రూపాయి..
డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం.
ట్రస్ట్ ఫిన్‌టెక్ @ రూ.95–101
సాస్ ప్రొడక్ట్ ఆధారిత ఫిన్‌టెక్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లు అందించే ట్రస్ట్ ఫిన్‌టెక్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment