గృహ రుణాలపై వడ్డీ రేట్లు కట్
♦ 0.3 శాతం దాకా తగ్గించిన
♦ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ
♦ మహిళలకు 8.35 శాతమే వడ్డీ రేటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ బాటలోనే ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తున్నాయి. తాజాగా అందుబాటు ధరల్లో గృహాలను ప్రోత్సహించే దిశగా.. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు.. రూ. 30 లక్షల దాకా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటును 0.3 శాతం దాకా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇకపై రూ. 30 లక్షల దాకా గృహ రుణాలు తీసుకునే మహిళలకు వడ్డీ రేటు 8.35 శాతంగా (ఇప్పటిదాకా ఇది 8.50%) ఉంటుందని, ఇతరులకు 8.40 శాతంగా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సోమవారం ప్రకటించింది. అలాగే రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ రుణగ్రహీతలు అందరికీ 8.50 శాతంగానే వడ్డీ రేటు కొనసాగుతుందని, రూ.75 లక్షలు దాటితే రేటు 8.55 శాతంగా ఉంటుందని (ప్రస్తుతం ఇది 8.75 శాతం) పేర్కొంది. కొత్త రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.
ఐసీఐసీఐ బ్యాంక్...
రూ. 30 లక్షల దాకా గృహ రుణాలు తీసుకునే ఉద్యోగినులకు వడ్డీ రేటు 8.35 శాతంగాను, ఇతరులకు 8.40 శాతంగాను ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. హోమ్ లోన్ తీసుకునే వారి సౌలభ్యం కోసం వడ్డీ రేట్ల విషయంలో రెండు రకాల ఆప్షన్లు ఇస్తున్నట్లు వివరించింది. రుణ గ్రహీతలు కావాలనుకుంటే తొలి రెండు/మూడేళ్లకు ఫిక్సిడ్ లేదా ఫ్లోటింగ్ రేటు ఎంచుకోవచ్చని ఆ తర్వాత చలన వడ్డీ రేటు అమలవుతుందని పేర్కొంది. అలా కాకుంటే ఆరు నెలలు లేదా ఏడాది వ్యవధికి సంబంధించిన మారిజనల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ప్రాతిపదికన కూడా రుణాలు పొందవచ్చని తెలిపింది.
తగ్గించిన వడ్డీ రేటు కొత్త ఖాతాదారులకు మే 15 నుంచే అందుబాటులోకి వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వివరించింది. 2022 నాటికల్లా అందరికీ అందుబాటు ధరల్లో సొంత ఇల్లు సమకూర్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తోడ్పడే దిశగా తాము ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్), అల్పాదాయ వర్గాలు (ఎల్‌ఐజీ) ఇటు తక్కువ వడ్డీ రేట్లతో పాటు అటు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద క్రెడిట్ ఆధారిత సబ్సిడీ ప్రయోజనాలు కూడా పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ తెలిపారు.
రేట్ల తగ్గింపుతో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు, హెచ్‌డీఎఫ్‌సీ గృహ రుణాల వడ్డీ రేట్లు దాదాపు ఒకే స్థాయిలో ఉండనున్నాయి. ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇటీవలే అందుబాటు ధరల్లోని గృహ రుణాలపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల దాకా తగ్గించింది. కొత్తగా రుణం తీసుకునే మహిళలకు 8.35 శాతం వడ్డీ రేటే వర్తింపచేస్తోంది. హోమ్ లోన్ విభాగంలో ఎస్‌బీఐకి అత్యధికంగా 26 శాతం మార్కెట్ వాటా ఉంది.