ముంబై : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీగా ఉద్యోగ నియామకాలకు తెరతీయబోతుంది. సుమారు 9500 మంది జూనియర్ అసిస్టెంట్‌లను నియమించుకోనున్నట్టు బ్యాంకు తెలిపింది. వీరిని కస్టమర్ సపోర్ట్, సేల్స్ ఫంక్షన్ల కోసం వీరిని ఉపయోగించుకోనున్నట్టు పేర్కొంది. 2013 నుంచి బ్యాంకు చేపట్టిన నియామకాల్లో ఇదే అతిపెద్ద రిక్రూట్‌మెంట్ అని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
కాగ, ఎస్‌బీఐ తన అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకున్న అనంతరం వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టడంతో, ఈ క్వార్టర్‌లో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య 10వేలకు పైగా తగ్గిపోయింది. అంతేకాక డిజిటల్ బ్యాంకింగ్, నేరుగా ప్రాసెసింగ్ వంటి వాటిని ప్రవేశపెట్టడంతో బ్యాంకులో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా తగ్గిపోయింది. కానీ కస్టమర్ ఫేసింగ్ ఎంప్లాయీస్ అవసరం ఎక్కువగా ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా క్లిరికల్ గ్రేడ్ పొజిషన్లకు బ్యాంకు ఈ ప్రకటన విడుదల చేసింది.
2017 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంకు ఉద్యోగులు సంఖ్య 2,69,219 మందికి తగ్గిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యాంకు ఉద్యోగులు 2,79,803గా ఉన్నారు. అంటే 10,584 మంది ఉద్యోగులు తగ్గిపోయారు. ఈ క్రమంలోఎంట్రీ లెవల్ ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవాల్సినవసరం వచ్చిందని బ్యాంకింగ్ అధికారులు పేర్కొన్నారు. ఎక్కువగా నియామకాలు ఉత్తరప్రదేశ్‌లో ఉండనున్నాయని, అనంతరం మహారాష్ట్రలో ఉండబోతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment