తాకట్టు కోసం పరుగో.. పరుగు! | some telugu company's putted on mortgage | Sakshi
Sakshi News home page

తాకట్టు కోసం పరుగో.. పరుగు!

Published Thu, Oct 6 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

తాకట్టు కోసం పరుగో.. పరుగు!

తాకట్టు కోసం పరుగో.. పరుగు!

రూ.2 లక్షల కోట్ల ప్రమోటర్ల వాటాలు తనఖాలోనే!!
మొత్తం వాటాను తాకట్టు పెట్టేసిన పలు తెలుగు కంపెనీలు
అలాంటి కంపెనీల విషయంలో జాగ్రత్త వహించాలంటున్న నిపుణులు
ఏడేళ్ల గరిష్టానికి చేరిన ఎన్‌ఎస్‌ఈ కంపెనీల వాటాల తనఖా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వ్యక్తిగత అవసరాలు కావొచ్చు. కంపెనీ అవసరాలు కావొచ్చు. ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టే సందర్భాలు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. గడచిన కొన్నేళ్లుగా చూస్తే... దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్లు గరిష్ట స్థాయికి చేరాయి. ఈ బాటలోనే రాష్ట్రానికి చెందిన కంపెనీల ప్రమోటర్లు కూడా తనఖా పెట్టిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చూస్తే... గడచిన కొద్ది కాలంలో గ్రాన్యూల్స్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ప్రమోటర్లు షేర్లను తనఖా పెట్టారు.

మరో రుణం రీఫైనాన్స్ కోసం గ్రాన్యూల్స్ ఇండియా ఎండీ కృష్ణప్రసాద్ చిగురుపాటి సెప్టెంబర్ 26న దాదాపు 32 లక్షల షేర్లను ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌కు ప్లెడ్జ్ చేశారు. అప్పటి షేరు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ.39 కోట్లుగా ఉంటుందని అంచనా. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబరుల్లో వ్యక్తిగత రుణం కోసం కొన్ని షేర్లను తనఖా పెట్టడం, విడిపించుకోవటం కూడా చేశారు. కృష్ణప్రసాద్‌కు కంపెనీలో 36.51 శాతం వాటా (7,92,30,610 షేర్లు) ఉంది. దీన్లో 1.62 కోట్ల షేర్లను ప్లెడ్జ్ చేశారు. గ్రాన్యూల్స్ ఇండియాలో ప్రమోటర్లకు 51.08 శాతం వాటాలుండగా.. అందులో సుమారు 27 శాతం తనఖాలో ఉంది.

మరోవైపు డాక్టర్ రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ గత నెల 8, 9 తారీఖుల్లో రెండు విడతల్లో 6,22,080 షేర్లను సిటీ కార్ప్ ఫైనాన్స్‌కు తనఖా పెట్టారు. వ్యక్తిగత రుణ అవసరాల కోసం వీటిని తనఖా ఉంచినట్లు తెలియజేశారు. అంతకు కొద్ది రోజుల ముందే సెప్టెంబర్ 2న చైర్మన్ సతీష్ రెడ్డి 7,46,500 షేర్లను సిటీ కార్ప్ ఫైనాన్స్ వద్ద తనఖా పెట్టారు. తనఖా పెట్టిన కొన్నాళ్లకే సతీష్ రెడ్డి, జీవీ ప్రసాద్ తమ సంస్థ షేర్లను భారీగా ఓపెన్ మార్కెట్లో కొనటం గమనార్హం.

ఇన్వెస్టర్లకు ఆందోళనకరం...
వ్యక్తిగత అవసరాల కోసం మొత్తం ప్రమోటర్లలో ఒకరిద్దరో, లేకపోతే ఉన్నదాంట్లో నామమాత్రపు వాటానో తనఖా పెట్టడం సహ జమే. దీన్ని ఇన్వెస్టర్లు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే మొత్తం ప్రమోటర్లందరూ తనఖా బాట పట్టడమో, లేదంటే మెజారిటీ షేర్లను తనఖా పెట్టడమో చేస్తే మాత్రం ఇన్వెస్టర్లు ఆ కంపెనీని అంతగా ఇష్టపడరు. ఇలా చేస్తే ఆ కంపెనీ మున్ముందు పెద్దగా వృద్ధి చెందే అవకాశాల్లేవని సాక్షాత్తూ ప్రమోటర్లే సంకేతాలిచ్చినట్లుగా భావిస్తారు. 

ఒకవేళ ప్రమోటర్లు తమ షేర్లను తనఖా పెట్టి, అలా తీసుకున్న డబ్బుతో కొత్త షేర్లు కొంటుంటే... ఆ కంపెనీపై వారికి బాగా నమ్మకం ఉన్నట్లు భావించాలని, మున్ముందు దాని షేరు ధర పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. షేరు ధర పెరుగుతుందనే నమ్మకం ఉండబట్టే ప్రమోటర్లు కొత్తవి కొంటున్నారని భావించొచ్చు. అందుకు తగ్గ డబ్బులు లేక తమ వద్ద ఉన్న షేర్లను తనఖా పెడుతూ ఉండొచ్చు. ఎందుకంటే షేరు ధర పెరిగితే కొత్త వాటిని విక్రయించైనా, నామమాత్రపు వడ్డీ చెల్లించి పాతవి విడిపించుకోవచ్చు. లాభాలతో బయటపడొచ్చు’’ అని స్టాక్ మార్కెట్ విశ్లేషకుడొకరు అభిప్రాయపడ్డారు.

ఇక ప్రమోటర్లు భారీగా షేర్లను తనఖా పెట్టిన చాలా కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పరమైన సమస్యలున్నట్టేనని మరికొందరు చెప్పారు. ‘‘ఆయా సంస్థల ఆర్థిక  స్థితి ఒత్తిళ్లలో ఉండటంతో మరిన్ని నిధులు సమీకరించగలిగే పరిస్థితి వాటికి ఉండదు. ఒక్కోసారి ర్యాలీలో ప్రమోటర్ల వాటాల తనఖాలను గురించి ఇన్వెస్టర్లు పట్టించుకోకుండా.. మిగతా కంపెనీల స్టాక్స్‌తో పాటు ఈ సంస్థల షేర్లను కూడా పరుగులు తీయించినా.. సెంటిమెంట్ మారిందంటే మాత్రం వీటికి గడ్డుకాలమే. మార్కెట్ తిరోగమించి.. ధరలు పతనమైతే, సదరు షేర్లను తనఖా పెట్టుకున్న ఫైనాన్స్ కంపెనీలు వాటిని అమ్మేయడమో లేదా కంపెనీని స్వాధీనం చేసుకోవడమో జరుగుతుంది’’ అని వారు పేర్కొన్నారు.

ఏడేళ్ల గరిష్టానికి వాటాల తనఖాలు..
ఇటీవలి గణాంకాల ప్రకారం తనఖాలో ఉన్న ప్రమోటర్ల వాటాల విలువ ఏడేళ్ల గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో లిస్టయిన 1,517 కంపెనీల్లో సుమారు 522 కంపెనీల ప్రమోటర్లు తమ వాటాలు తనఖాలో ఉంచారు. కొంతకాలంగా షేర్ల ధరలు బాగా పెరగటం వల్ల కూడా తనఖాలో ఉన్న స్టాక్స్ విలువ గరిష్టానికి చేరిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి వీటి విలువ దాదాపు రూ.2.08 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇక 31 కంపెనీలకు చెందిన ప్రమోటర్ల వాటాలైతే మొత్తం తనఖాలోనే ఉన్నాయి.

రాష్ట్ర కంపెనీల విషయానికొస్తే... జూన్ నెలాఖరు నాటి గణాంకాల ప్రకారం కేంద్ర మంత్రి సుజనా చౌదరికి చెందిన సుజనా టవర్స్, సుజనా మెటల్స్‌తో పాటు గాయత్రి ప్రాజెక్ట్స్, ఐవీఆర్‌సీఎల్, డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర సంస్థల ప్రమోటర్ల వాటాలు మొత్తం తనఖాలోనే ఉన్నాయి. మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ ఇన్‌ఫ్రాలో ప్రమోటర్లకు 61.61 శాతం (దాదాపు 372 కోట్ల షేర్లు) వాటాలు ఉండగా.. దీన్లో 73.55  శాతాన్ని (సుమారు 274 కోట్ల షేర్లు) తనఖా పెట్టారు. మరో దిగ్గజం ల్యాంకో ఇన్‌ఫ్రాలో ప్రమోటర్లకు 70.55 శాతం వాటాలుంటే.. అందులో దాదాపు 81 శాతం తాకట్టులో ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement