
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ముంబై: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం ఒక్కరోజే ముంబై స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర రూ. 730 తగ్గింది. దేశీయ మార్కెట్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 30,520కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ.1,750 పడిపోయి రూ.43,250కు దిగజారింది.
అమెరికాలో వడ్డీరేట్లు పెరగడానికి తగిన బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా పసిడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ (నెమైక్స్)లోనూ పసిడి, వెండి ధరలు పతనమయ్యాయి. అమెరికా సెప్టెంబర్ తయారీ రంగం పటిష్ట పడిందన్న వార్తలు ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 0.25 శాతం 0.50 శాతం) ఈ ఏడాది పెరగవచ్చన్న అంచనాలు పసిడిపై ప్రభావం చూపాయి. ఈ అంచనాలతో డాలర్ బలపడి.. పుత్తడి ధర దిగజారింది.