నాలుగు లక్షల టయోటా కార్లు రీకాల్
టోక్యో: జపాన్ లో ప్రముఖ కార్ల కంపెనీ టయోటాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు నాలుగు లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు జపనీస్ వాహన తయారీదారు టయోటా మోటార్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. కొన్ని సాంకేతిక లోపాల కారణంగా జపాన్ సహా, కొన్ని విదేశీ మోడళ్లకు చెందిన సుమారు 3లక్షల తొంభై వేల కార్లను రీకాల్ చేస్తున్నట్టు వెల్లడించింది.
దేశీయ మార్కెట్లో విడుదల చేసిన లగ్జరీ సెడాన్ మోడల్, మార్క్ X సెడాన్ మోడళ్ల సుమారు 3,26, 000 వాహనాలను టయోటా రీకాల్ చేసింది. డిసెంబర్ 2003, 2007 అక్టోబర్ మధ్య కాలంలో ఉత్పత్తి చేసిన ఈ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించింది. దీంతోపాటుగా యూరోప్ , ఓషియానియా, ఆసియా తదితర ప్రాంతాలలో కూడా IS250, GS300 మోడళ్ల మరో 64 వేల వాహనాలను వెనక్కి పిలిపించింది . ఇంధనం సరఫరా చేసే ఫ్యూయల్ ప్రెజర్ సెన్సార్ ఎటాచ్ మెంట్ లో లోపం కారణంగా లీకేజ్ సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
స్లీరియో ఆంప్లిఫైయర్ లో లోపాలకారణంగా క్రౌన్ , క్రౌన్ మెజెస్టా మోడళ్లకు చెందిన దాదాపు 17 వేల కార్లను రీకాల్ చేసింది. స్టీరియో యాంప్లిఫైయర్ సిస్టమ్ లో తలెత్తిన ఎలక్ట్రికల్ లోపాల కారణంగా జనవరి 2008 మరియు జూలై 2013 మధ్య తయారైనకార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది.