వివాదాస్పదమైన ‘విక్స్’ యాడ్
విక్స్‌ను ఉత్పత్తి చేస్తున్న ‘ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్’ సంస్థ రూపొందించిన ఓ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా వివాదాస్పదమైంది. సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న తన స్నేహితురాలు ఎయిడ్స్‌తో చనిపోగా అనాథైన ఆమె ఆరేళ్ల కూతురును ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాడుతున్న ఓ హిజ్రా చేరదీయడం, ఆ పాపను ఆప్యాయంగా పెంచడమే యాడ్ ఇతివృత్తం. భారత్‌లో పిల్లలను దత్తత తీసుకునే హక్కు హిజ్రాలకు లేదు.
సంప్రదాయబద్ధమైన కుటుంబాలకు విలువనిచ్చే భారతీయ సంస్కృతిలో హిజ్రాలను చూపించడం, వారి హక్కులను సమర్థించడం బాగోలేదని కొందరు విమర్శిస్తుండటంతో ఈ యాడ్ వివాదాస్పదమైంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అనాథైన ఓ పాపను హిజ్రా చేరదీయడం, వారిమధ్య నెలకొన్న మమతానుబంధాన్ని హృద్యంగా తీయడం తమను ఎంతో హత్తుకుందంటూ ఎక్కువ మంది యాడ్‌ను ప్రశంసిస్తున్నారు.
హిజ్రా అయినా పాపను ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో చెప్పడమే తమ ఉద్దేశమని, దాన్ని మనసుకు హత్తుకునేలా భిన్నంగా చెప్పడానికి ప్రయత్నించామని కంపెనీ వర్గాలు అంటున్నాయి. ‘టచ్ ఆఫ్ కేర్’ సిరీస్‌లో భాగంగా కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. ట్రాన్స్‌జెండర్ హక్కులకు సంబంధించి ఈ యాడ్ అద్భుతమైనదని కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ట్విట్టర్‌లో స్పందించారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు కూడా ఈ యాడ్ పట్ల భిన్నంగా స్పందించారు.
తాను ఒక సామాజిక కార్యకర్తగా ఏ విషయాన్నైనా ప్రజల దృక్పథం నుంచి చూస్తానని, ఈ యాడ్ వల్ల తమ కమ్యూనిటీకి ఏం లాభం చేకూరుతుందో తనకు అర్థం కావడం లేదని ట్రాన్స్‌జెండర్ల హక్కుల కార్యకర్త కల్కీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. 'సమాజంలో మాకు పౌరులుగా హక్కులున్నాయని చెప్పడం, తల్లులయ్యే హక్కు మాకూ ఉందని చెప్పడం వరకు నేను యాడ్‌ను సమర్థిస్తాను. కానీ సబ్జెక్ట్‌ను సంచలనం చేయడమే నాకు నచ్చలేదు' అని ఆమె అన్నారు. భారత్‌లో హిజ్రాలుగా పిలిచే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ మూడు వేల సంవత్సరాల క్రితం నుంచే మనుగడలో ఉంది. భారత ఉప ఖండాన్ని పాలించిన మొగల్ రాజులు, హిజ్రాలకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయని నమ్మేవాళ్లు. వారిని రాజ్యరక్షకులుగా గౌరవించేవారు. సలహాదారులుగా కూడా నియమించుకునేవారు. బ్రిటిష్ పాలకుల రాకతో హిజ్రాలకున్న ప్రాధాన్యం పూర్తి కాలగర్భంలో కలిసిపోయింది.