యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం.. | We work together with the management | Sakshi
Sakshi News home page

యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం..

Published Sat, Dec 6 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం..

యాజమాన్యంతో కలిసి పనిచేస్తాం..

యాజమాన్యంతో కలిసి పనిచేస్తామని, కంపెనీకి పునర్‌వైభవం తీసుకొస్తామని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు.

కార్మిక సంఘాన్ని గుర్తించాల్సిందే
న్యాయమైన డిమాండ్లు మావి
మేనేజర్ల కారణంగానే వివాదం
ఓసీటీఎల్ కార్మిక సంఘం


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాజమాన్యంతో కలిసి పనిచేస్తామని, కంపెనీకి పునర్‌వైభవం తీసుకొస్తామని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులార్ కార్మికులు ముక్తకంఠంతో చెబుతున్నారు. సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని నిలబెడతామని ఓసీటీఎల్ కార్మిక సంఘం అధ్యక్షులు గోగుల యాదగిరి శుక్రవారం తెలిపారు. సంఘం నేతలతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఓసీటీఎల్ యాజమాన్యంతో కలిసి పనిచేసేందుకు కార్మికులు అంతా సిద్ధమని వారు వెల్లడించారు. అయితే కార్మిక సంఘాన్ని ఓసీటీఎల్ యాజమాన్యం గుర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. న్యాయపరమైన హక్కుల సాధనకే సంఘాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సంఘం ఏర్పడ్డనాటి నుంచే వేధింపులు అధికమయ్యాయని వివరించారు.

నూతన వేతన చట్టాన్ని..
ఓసీటీఎల్ కార్మిక సంఘం పలు డిమాండ్లను కంపెనీ యాజమాన్యం ముందు ఉంచింది. నూతన వేతన చట్టం 12/3 అమలు, ఈఎస్‌ఐ సౌకర్యం, 33 మంది కార్మికులపై పెట్టిన కేసుల ఎత్తివేత, కంపెనీ తొలగించిన 83 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం వీటిలో ప్రధానమైనవి. కొత్త వేతనం, ఈఎస్‌ఐ సౌకర్యం కార్మికులకు చెందాల్సిన న్యాయపరమైన హక్కులని సంఘం ఉపాధ్యక్షుడు కుసుమ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాడూరి ఆంజనేయులు అన్నారు.

28 ఏళ్ల సర్వీసున్న ఒక కార్మికుడి బేసిక్ వేతనం రూ.8 వేలు మాత్రమే ఉందని సహాయ కార్యదర్శి జెనిగ చంద్రశేఖర్ తెలిపారు. వేతన ఒప్పందం సమయంలో మేనేజర్లదే తుది నిర్ణయమని చెప్పారు. ఇంకాస్త పెంచండి అని అడిగితే అధికారులు బెదిరిస్తారని వివరించారు. కార్మికులకు ఇస్తున్న వేతనం, కార్మిక శాఖకు చూపిస్తున్న లెక్కలకు పొంతన లేదన్నారు. వేతనం రూ.3-4 వేలైనా తేడా ఉంటుందని చెప్పారు.

హాని తలపెట్టలేదు..
సంఘం ఏర్పాటుకు ముందు, ఏర్పడ్డాకా కూడా ఏ ఒక్క కార్మికుడు కంపెనీ ఆస్తులకు ఎటువంటి హాని తలపెట్టలేదని సంఘం సంయుక్త కార్యదర్శి నామా రాంప్రసాద్ తెలిపారు. సంఘంలో చేరిన 480 మంది కార్మికులపై వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. కంపెనీ యాజమాన్యం, అధికారులు సమ్మె నోటీసును స్వీకరించలేదని ప్రచార కార్యదర్శి దొండ జంగయ్య తెలిపారు. సమ్మె చేస్తున్న ప్రతి సందర్భంలోనూ సమాచారం ఇచ్చామని అన్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ పేరుతో వేధింపులు, జరిమానాలు వేస్తున్నారని కోశాధికారి ఆమనిగంటి ఉమామహేశ్వర్‌రెడ్డి వివరించారు. కంపెనీ రూల్స్ ఏమిటో చెప్పరు. రూల్స్ ఉల్లంఘన అంటారని తెలిపారు.
 
మేనేజర్లదే ఇష్టారాజ్యం...
ఓసీటీఎల్ మేనేజర్లదే ఇష్టారాజ్యమని ఓసీటీఎల్ కార్మిక సంఘం నేతలు ఆరోపించారు. కంపెనీ కార్యకలాపాల్లో యాజమాన్యం పాత్ర ఎక్కడా కనపడదని, అంతా మేనేజర్లే చక్కబెడతారని చెప్పారు. ఈ అధికారంతోనే కార్మికులను బెదిరించడం, చెప్పినట్టు చేయకపోతే జరిమానాలు విధిస్తున్నారని వెల్లడించారు. జరిమానాల పేరుతో లక్షలాది రూపాయలు పోగేసుకున్నారని చెప్పారు.  కార్మిక సంఘం ఏర్పడితే వచ్చే సమస్య ఏమిటంటూ మేనేజర్లపై కామినేని గ్రూప్ డెరైక్టర్ అగ్రహం వ్యక్తం చేశారని సంఘ నాయకులు తెలిపారు. మీరు కలిసికట్టుగా ఉన్నప్పుడు కార్మికులు ఎందుకు ఉండకూడదంటూ మేనేజర్లను నిలదీసినట్టు తమకు తెలిసిందని చెప్పారు.
 
నేరుగా కార్మికులతో మాట్లాడితే....
ఎనమిదేళ్ల సర్వీసులో తానెప్పుడూ కంపెనీ యజమానులను కలవలేదని సంఘం కార్యవర్గ సభ్యుడు చిట్టిమళ్ల కిరణ్ తెలిపారు. మా గోడు వెళ్లబోసుకుందామన్నా సెక్యూరిటీ సిబ్బంది యాజమాన్యాన్ని కలవనివ్వరని సంఘం నాయకులు నర్సింగ్ వెంకన్న, పోకల శ్రీకాంత్ తెలిపారు. కార్మికులతో నేరుగా మాట్లాడితే వాస్తవాలు యాజమాన్యానికి తెలిసేవని మీసాల గోపయ్య, షేక్ హకీం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement