ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ రఘు రెడ్డికి అమెరికా సత్కారం
కాలిఫోర్నియా :
అమెరికా ప్రభుత్వం ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ, ఫిలాంత్రఫిస్ట్(దాత) అయిన కాకి రఘు రెడ్డిని ఘనంగా సన్మానించింది. రఘు రెడ్డి చేస్తున్న సామాజిక కార్యక్రమాలకుగానూ కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లోని సిటీ హాల్‌లో ఘనంగా సత్కరించారు. కాలిఫోర్నియా, ఉత్తర అమెరికాలో ఆయన చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సమాజ సేవకు గానూ ఈ గుర్తింపు లభించింది. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో రఘురెడ్డి సమాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, వివిధ సంస్కృతిక, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎన్నో ఏళ్లుగా ఆటా రీజినల్ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రఘురెడ్డి ఇటీవలే ఆటా ప్లానింగ్ ఛైర్మన్‌గా కూడా ఎన్నికయ్యారు. తెలుగు మాట్లాడే వ్యక్తిగా రఘురెడ్డి తొలిసారి మిల్‌పిటాస్ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగర అభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. ప్రస్తుతం రఘురెడ్డి మిల్‌పిటాస్ నగర కమిషనర్‌గా, ఆటా ప్లానింగ్ ఛైర్మన్‌గా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పీటీఏ(రస్సెల్ మిడిల్ స్కూల్)గా, టోస్ట్ మాస్టర్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పదవుల్లో కొనసాగడమే కాకుండా వివిధ రాజకీయ, సంస్కృతిక సంస్థల్లో కీలక సభ్యులుగా ఉన్నారు. మిల్‌పిటాస్ కౌన్సిల్ సభ్యులు, రఘురెడ్డి భార్య పద్మజా, కూతుళ్లు నిధి రెడ్డి, నిత్యా రెడ్డిల సమక్షంలో మిల్‌పిటాస్ మేయర్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందించారు. రఘురెడ్డి స్వస్థలం సూర్యాపేట్ జిల్లాలోని తిరుమలగిరి మండలం.