జిల్లాకు సబ్‌స్టేషన్లు మంజూరు
కడప కోటిరెడ్డి సర్కిల్ :
జిల్లాలో కొత్తగా 11 విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, వాటికి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్‌వీఎస్ సుబ్బరాజు తెలిపారు. గురువారం సాయంత్రం కడప నగరంలోని విద్యుత్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కొత్తగా 11 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కడప, ప్రొద్దుటూరులో ఇండోర్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇండోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 5–10 సెంట్ల స్థలం, అవుట్‌డోర్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి 40 సెంట్ల స్థలం కావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇటీవల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశామని, అవి కాలిపోయినట్లు ఫిర్యాదులు రావడంతో వాటి స్థానంలో కొత్త బల్బులు ఇస్తున్నామని తెలిపారు. కాలిపోయిన బల్బులు, కరెంటు బిల్లుల జిరాక్స్ తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పొందవచ్చన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు విజిలెన్స్ స్వా్కడ్ తిరుగుతోందన్నారు.
ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. కనుక విద్యుత్‌ను అక్రమంగా వాడుకునే వారు రూ. 125 చెల్లించి దీన్ దయాళ్ స్కీం కింద సర్వీసును పొందితే దాదాపు రూ. 7 వేల మెటీరియల్‌ను ఉచితంగా ఇస్తామన్నారు. నగదును ఏ విధంగా ఏటీఎంలలో తీసుకోవడం, డిపాజిట్ చేస్తున్నామో అదేవిధంగా కడప నగరంలో ఏపీపీలను ఏర్పాటు చేశామని, అందులో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. ఇవి 24 గంటలు పని చేస్తాయని, వినియోగదారులు ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఎవరైనా వినియోగదారుల నుంచి డబ్బులు అడిగితే తమకు ఫోన్ నంబర్: 94408 11751కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్: 1800 425155 333లో సంప్రదించాలని ఆయన వివరించారు.