న్యాయంకోసం పాతికేళ్లుగా పోరాటం | 25 years on, justice eludes Dalit victims of Tsunduru | Sakshi
Sakshi News home page

న్యాయంకోసం పాతికేళ్లుగా పోరాటం

Published Sat, Aug 6 2016 8:37 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

చుండూరులోని రక్తక్షేత్రం.. బందోబస్తులో పోలీసులు (ఫైల్) - Sakshi

చుండూరులోని రక్తక్షేత్రం.. బందోబస్తులో పోలీసులు (ఫైల్)

చుండూరు హత్యాకాండ జరిగి నేటికి 25 ఏళ్లు
పెండింగులోనే మూడు అప్పీళ్లు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అనాసక్తి..!

 
ఆగస్టు 6.. 1991. గుంటూరు జిల్లా చుండూరు గుండె పగిలింది. రెండు వర్గాల మధ్య అడపాదడపా జరుగుతున్న చిన్న ఘర్షణలు చినికిచినికి గాలివానగా మారాయి. ఎనిమిదిమంది దళితులు ఊచకోతకు గురయ్యారు. ఈ దారుణం మరుసటిరోజు వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందనేది ఆ తరువాత రోజుకుగానీ బయటి ప్రపంచానికి తెలియలేదు. ఈ దారుణం తెలిసి యావద్దేశం నిర్ఘాంతపోయింది.
 
తెనాలి: చుండూరులో దళితులపై జరిగిన హత్యాకాండ కేసులో సుప్రీంకోర్టులో అప్పీళ్లలో పురోగతి లేదు. రెండేళ్ల కిందట దాఖలైన మూడు అప్పీళ్లు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. పత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా చేశారు. సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఆరోగ్యం సహకరించని పరిస్థితి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరగలేదు. దళితుల తరఫు అప్పీలుపై వాదనకు ఏర్పాటైన సీనియర్ న్యాయవాది మరణించారు. మరొకరి నియామకం లేకుండాపోయింది. దీంతో అప్పీళ్ల పెండింగ్ అనివార్యమైంది. ఇలాగే కొనసాగితే చుండూరు దళితులు మరోసారి దగా పడే అవకాశముంది.

చుండూరులో దళితుల హత్యలు జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. దాడులపరంగానే కాదు.. దళిత మహాసభ వ్యవస్థాపకుడు కత్తి పద్మారావు నేతృత్వంలో చుండూరు నుంచి ఢిల్లీ వరకు దళిత ఉద్యమం జరిగిన తీరు, పునరావాసం, నేరం జరిగినచోటే విచారణ, తీర్పు అనే ప్రత్యేకతలతో ఈ కేసు చారిత్రాత్మకమైంది. ప్రతిఘటనోద్యమం ఫలితంగా దళితుల రాజకీయ, సామాజిక చైతన్యం పదునుదేరి వారి ప్రస్థానాన్ని సమున్నతం చేసింది. అనేక అవరోధాలను ఎదురైనా.. అధిగమించి 16 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు దేశచరిత్రలో సంచలనమైంది. 2007 జూలై 31న చుండూరులోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు జడ్జి అనిస్.. ఈ కేసులో 21 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పుచెప్పారు. మరో 35 మందికి ఏడాది జైలు, రెండువేల రూపాయల జరిమానా విధించారు. 123 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు.

ఈ తీర్పు అన్యాయమంటూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. తమను నిర్దోషులుగా ప్రకటించాలని ముద్దాయిలు, కేవలం 21 మందికే జీవితఖైదు విధించారని, ఏడాది శిక్ష పడిన 35 మందికి, నిర్దోషులుగా ప్రకటించిన వారికి యావజ్జీవం విధించాలని దళితులు అప్పీలు చేశారు. ప్రభుత్వం తరఫున అప్పీళ్లున్నాయి. న్యాయపరమైన అంశాలతో ముద్దాయిల అప్పీలునే హైకోర్టు విచారణకు స్వీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన సహాయకుడు కొత్తగా అప్పీళ్లు దాఖలు చేసినా, మరింత జాప్యం జరుగుతుందన్న భావనతో హైకోర్టు న్యాయమూర్తి నిరాకరించారు. ముద్దాయిల అప్పీలుపై విచారించి, వారిని నిర్దోషులుగా తీర్పునిచ్చారు.

2014 ఏప్రిల్ 22న వెలువడిన ఈ తీర్పుతో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. ఈ కేసు వ్యవహారాలను చూసేందుకు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, నెల్లూరుకు చెందిన జస్టిస్ ఎం.ఎన్.రావును ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంను సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రభుత్వం నియమించింది. హైకోర్టు  తీర్పు అన్యాయమని, దిగువ కోర్టు తీర్పును వర్తింపజే సి శిక్షలు పునరుద్ధరించాలని కోరుతూ ఎం.ఎన్.రావు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు తీర్పును రద్దుచేసి.. ముద్దాయిలు, దళితులు, ప్రభుత్వం.. ముగ్గురి అప్పీళ్లను ఏకకాలంలో విచారించి తీర్పునివ్వాల్సిందిగా కేసును తిప్పిపంపించాలని మరో అప్పీలు దాఖలు చేశారు. అప్పటివరకు హైకోర్టులో పెండింగులో ఉన్న రెండు అప్పీళ్లను విచారించకుండా స్టే ఇవ్వాలని కోరారు. ఆ ప్రకారం సుప్రీంకోర్టు 2014 జూలె 30న స్టే ఉత్తర్వులు జారీచేసింది. దళితులు కూడా మరో ప్రైవేటు అప్పీలును దాఖలు చేసి, సీనియర్ న్యాయవాది ఆల్తాఫ్ అహ్మద్‌ను న్యాయవాదిగా నియమించుకున్నారు.

కొద్దికాలం తర్వాత స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.ఎన్.రావు తన పదవికి రాజీనామా చేశారు. సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొజ్జా తారకం శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిసింది. దళితుల తరఫు న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ కన్నుమూశారు. దీంతో మూడు అప్పీళ్లు పెండింగులో పడ్డాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకాన్ని ప్రభుత్వం చేపట్టలేదు, దళితులు మరొక న్యాయవాదిని నియమించుకోలేదు. ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement