ఆశల వరద
-
సోమశిలకు 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
-
ఉధృతంగా కుందూ నది
-
10 టీఎంసీలకు చేరువలో సోమశిల
సోమశిల : జిల్లాలోని సోమశిల జలాశయం ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అడుగంటిన జలాశయ నీటిమట్టంతో ఆందోళన చెందుతున్న రైతులకు ఆశల వరద ఊరటనిస్తోంది. నాలుగు రోజులుగా కర్నూలు, వైఎస్సార్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కుందూ నది నుంచి భారీగా వరద సోమశిల జలాశయం వైపు పరుగులు తీస్తోంది. తత్ఫలితంగా జిల్లా తాగు, సాగునీటి వరప్రసాదిని సోమశిల జలాశయం చాలా రోజుల తర్వాత వరద నీటితో ఉప్పొంగుతోంది. నిన్నమొన్నటి వరకు డెడ్ స్టోరేజ్‌కి పడిపోయిన సోమశిల నీటి మట్టం కేవలం 12 గంటల వ్యవధిలోనే 8.2 టీఎంసీలకు చేరింది. బుధవారం రాత్రికి 29వేల క్యూసెక్కులవంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో ఉదయం 7.771 టీఎంసీలు ఉన్న నీటి మట్టం సాయంత్రానికి 8.581 టీఎంసీలకు చేరింది. జలాశయం పైతట్టు ప్రాంతాలైన నంద్యాల సమీపంలో రాజోలు ఆనకట్ట వద్ద కుందూ నది ఉదయం రెండు వేల క్యూసెక్కులు ఉన్న వరద మధ్యాహ్నానికి 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రం వరకు ఈ ప్రవాహం ఇలాగే కొనసాగుతోంది. పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ ఉన్న వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 14 వేల క్యూసెక్కులు ఉన్న వరద మధ్యాహ్నానికి 18 వేలకు పెరిగి సాయంత్రానికి 25 వేల క్యూసెక్కులకు చేరింది. చెన్నూరు వద్ద పెన్నా ఉధృతి ఉదయం 16 వేల క్యూసెక్కులు వంతున గేజీ నమోదైంది. మధ్యాహ్నం వరకు నిలకడగా ఉన్న వరద సాయంత్రానికి 23 వేలకు పెరిగింది. రాత్రికి 30 వేలకు పెరగనుంది. ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే ప్రస్తుతం 5 టీఎంసీల వరకు సోమశిలకు వరద చేరవచ్చునని అధికారులు అంచనాలు వేస్తున్నారు.