టిప్పర్ కింద నలిగిన పసికందు
♦ మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
♦ తూప్రాన్ బైపాస్‌లో ఘటన
తూప్రాన్: యాభై రోజుల పసికందు టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ పసికందును బంధువులు బైక్‌పై ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తూప్రాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా...
ములుగు మండలం కొక్కొండకు చెందిన సుధాకర్, కవిత దంపతులు. వీరికి యాభైరోజుల క్రితం వరుణ్ తేజ్ జన్మించాడు. డెలివరీ కోసం తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లోని పుట్టింటికి వెళ్లిన కవిత అక్కడే ఉంటుంది. బుధవారం వరుణ్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అతడి తీసుకుని అమ్మమ్మ పద్మ, మామ శివ బైక్‌పై తూప్రాన్ ఆసుపత్రికి బయలు దేరారు. పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గల పెద్ద చెరువు కట్ట వద్దకు చేరుకున్నారు. వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన టిప్పర్ ఒక్కసారిగా చెరువు కట్టవైపు తిరిగింది. దీంతో వరుణ్ టిప్పర్ చక్రాల కింద నలిగిపోయాడు. బైక్‌తోపాటు శివ కూడా టైర్ల కింద ఇరుక్కుపోగా అమ్మమ్మ పద్మ రోడ్డు కిందకు ఎగిరిపడింది. చక్రాల కింద నలిగి వరుణ్‌తేజ్ అక్కడిక్కడే దుర్మరణం చెందగా అమ్మమ్మ, మామ గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఇరువురిని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కన్నీరుమున్నీరైన కవిత...
కొడుకు పుట్టి యాభైరోజులు కూడా కాకముందే ప్రాణాలు వదిలిన విషయాన్ని తెలుసుకున్న తల్లి కవిత కన్నీరుమున్నీరైంది. అచ్చటాముచ్చట తీరకముందే అనంత లోకాలకు పయనమైన కొడుకును చూసి తల్లడిల్లిపోయింది. ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడిపెట్టించింది. కవిత పుట్టినింటితోపాటు మెట్టినింటి వారు సైతం ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు.