6 అంటేనే హడల్
-
ఆ ఏడాదొస్తే మన్యంలో అలజడి
-
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ
-
గోదావరికి పొంచి ఉన్న వరద ముప్పు
-
ఆందోళనలో విలీన మండలాల ప్రజలు
మన రాష్ట్రంలో 1966,1976, 1986, 1996, 2006 ఇలా దశాబ్దాలుగా ఆరు అంకె చివర వచ్చే ఏడాదిలో గోదావరికి భారీగా వరదలొచ్చాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి.. గ్రామాలను వరదనీటితో ముంచెత్తింది. ప్రాణనష్టం జరగకపోయినా.. ఆస్తి, వేలాది ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది.
ప్రస్తుతం 2016 వర్షాల కారణంగా ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు గోదావరి నదిలోకి చేరుతోంది. ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పదనే ఆందోళన ఇక్కడి ప్రజలను వెంటాడుతోంది. ఆరు అంకె పేరు చెబితే చాలు ఏజెన్సీ వాసుల్లో అలజడి నెలకొంటోంది.
– నెల్లిపాక
గోదావరి ఉగ్రరూపం
ఏజెన్సీలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈ ఆరు అంకె సెంటిమెంట్‌పై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రతి దశాబ్దం ఆరు అంకె వచ్చిన ఏడాది ఐదుసార్లు భారీగా వరదలొచ్చాయి. గోదావరి నది 1996లో మినహా ఇప్పటి వరకూ ఐదుసార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండు, 53 అడుగులకు చేరితే మూడోది, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంత మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు, దేవీపట్నం లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు. ఏటా పరీవాహక ప్రాంత ప్రజలకు జులై నుంచి అక్టోబరు వరకూ వరదల భయం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
∙1986లో గోదావరికి సంభవించిన వరద పరీవాహక ప్రాంత ప్రజానీకాన్ని అతలాకుతలం చేసింది. ఆగస్టు 16న భద్రాచలం వద్ద 75.6 అడుగులకు చేరిన వరదకు వందలాది గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, సీఎం ఎన్టీ రామారావు పర్యటించారు.
∙2006లో వచ్చిన వరదల ముంపు ప్రాంతాలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్, సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటించారు.
పొంచి ఉన్న వరద ముప్పు
గోదావరికి వరద ముప్పు పొంచి ఉండడంతో ఏజెన్సీలోని విలీన మండలాల వాసుల్లో గుండె దడ మొదలైంది. ఇప్పటికే గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. గోదావరికి ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో గోదావరికి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వరద తీవ్రత ఏజెన్సీని చుట్టుముడుతుందని అనుమానిస్తున్నారు. చత్తీస్‌ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం నుంచి ప్రవహించి కూనవరం వద్ద గోదావరి సంగమంలో కలిసే శబరి పోటెత్తితే చింతూరు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. శబరి పోటు వల్ల గోదావరి వరద దిగువకు త్వరగా వెళ్లకపోవటంతో కూనవరం, ఎటపాక, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉంది. 2016 సెప్టెంబర్‌లో గోదావరికి వరద వస్తుందనే సమాచారంతో ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు.
వరదల వివరాలు
1966 – సెప్టెంబర్ 7– 65.9 అడుగుల నీటిమట్టం
1976– జులై 22 – 63.9 అడుగులు
1986– ఆగస్టు16 – 75.6 అడుగులు (ఇప్పటి వరకు ఇదే అత్యధికం)
1996– ఆగస్టులో 29.7 అడుగులు
2006– ఆగçస్టు8 – 66.9 అడుగులు