very danger
-
టెస్లా రోబో.. యమ డేంజర్!
అమెరికాలోని టెక్సాస్‌లో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ద్వారా ఈ విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ఆస్టిన్లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో.. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు టెస్లా రోబోలను వినియోగిస్తుంటారు. రోబోల సాఫ్ట్‌వేర్‌ను ఇంజినీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇన్‌యాక్టివ్ చేస్తారు. అయితే, ఘటన జరిగిన రోజున అప్పటికే ఇంజనీర్ రెండింటిని ఇన్‌యాక్టివ్ చేశాడు. మరో రోబోని చేయడం మరిచిపోయాడు. అలా.. అది అతనిపై దాడికి దిగింది. అప్డేట్ సమయంలో అది ఇంజినీర్‌ను కింద పడదోసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న ఉన్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా త్రీవ గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ రక్తిసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021,2022లో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. అయితే, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. టెక్సాస్‌లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం. కాగా, కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందని తెలిపారు. -
రాష్ట్రంలో మండుతున్న ఎండలు
-
‘టాప్’ లెవెల్లో డేం‘జర్నీ’
‘సురక్షితం, సుఖవంతం’.. ఇది ఆర్టీసీ నినాదం. అయితే ఈ చిత్రం చూస్తుంటే ఆ సంస్థ తన నినాదాన్ని తానే గౌరవించడం లేదనిపించక మానదు. ఆటోలు, జీపుల వంటి ప్రైవేట్ వాహనాల వారికి ప్రయాణికుల భద్రతకు సంబంధించి అణుమాత్రం స్పృహ కనిపించదు. వాహనాల సామరŠాథ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటారు. లోపల ఖాళీ లేకపోతే.. కొందరు కమ్మీలను పట్టుకుని వేలాడుతుండగానో, టాపులపై కూర్చుండగానో వాహనాలను నడిపేస్తుంటారు. సోమవారం భద్రాచలం నుంచి రావులపాలెం వెళుతున్న రావులపాలెం డిపోకు చెందిన ఏపీ29జెడ్ 3387 నంబర్ బస్సు లోపల మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. మారేడుమిల్లిలో ఓ యువకుడు బస్సుటాపుపైకి ఎక్కాడు. పలుచోట్ల విద్యుత్‌వైర్లు అతడు నిలబడితే తగిలేంత ఎత్తులోనే ఉన్నాయి. ‘ఆ యువకుడు టాపుపైకి మీకు తెలిసే ఎక్కాడా? తెలియకుండానా?’ అని డ్రైవర్, కండక్టర్లను అడిగితే పట్టించుకోకుండానే బస్సును లాగించేశారు. బస్సు పరుగందుకుంటుండగా ఆ యువకుడు సెల్ఫీ తీసుకోవడం కొసమెరుపు. – మారేడుమిల్లి -
6 అంటేనే హడల్
ఆ ఏడాదొస్తే మన్యంలో అలజడి ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ గోదావరికి పొంచి ఉన్న వరద ముప్పు ఆందోళనలో విలీన మండలాల ప్రజలు మన రాష్ట్రంలో 1966,1976, 1986, 1996, 2006 ఇలా దశాబ్దాలుగా ఆరు అంకె చివర వచ్చే ఏడాదిలో గోదావరికి భారీగా వరదలొచ్చాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి.. గ్రామాలను వరదనీటితో ముంచెత్తింది. ప్రాణనష్టం జరగకపోయినా.. ఆస్తి, వేలాది ఎకరాల్లో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం 2016 వర్షాల కారణంగా ఎగువనున్న ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు గోదావరి నదిలోకి చేరుతోంది. ఈ ఏడాది కూడా వరద ముప్పు తప్పదనే ఆందోళన ఇక్కడి ప్రజలను వెంటాడుతోంది. ఆరు అంకె పేరు చెబితే చాలు ఏజెన్సీ వాసుల్లో అలజడి నెలకొంటోంది. – నెల్లిపాక గోదావరి ఉగ్రరూపం ఏజెన్సీలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఈ ఆరు అంకె సెంటిమెంట్‌పై ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రతి దశాబ్దం ఆరు అంకె వచ్చిన ఏడాది ఐదుసార్లు భారీగా వరదలొచ్చాయి. గోదావరి నది 1996లో మినహా ఇప్పటి వరకూ ఐదుసార్లు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే రెండు, 53 అడుగులకు చేరితే మూడోది, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంత మండలాలైన ఎటపాక, కూనవరం, వీఆర్ పురం, చింతూరు, దేవీపట్నం లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తారు. ఏటా పరీవాహక ప్రాంత ప్రజలకు జులై నుంచి అక్టోబరు వరకూ వరదల భయం కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ∙1986లో గోదావరికి సంభవించిన వరద పరీవాహక ప్రాంత ప్రజానీకాన్ని అతలాకుతలం చేసింది. ఆగస్టు 16న భద్రాచలం వద్ద 75.6 అడుగులకు చేరిన వరదకు వందలాది గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. వరద ముంపు ప్రాంతాల్లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, సీఎం ఎన్టీ రామారావు పర్యటించారు. ∙2006లో వచ్చిన వరదల ముంపు ప్రాంతాలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్, సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటించారు. పొంచి ఉన్న వరద ముప్పు గోదావరికి వరద ముప్పు పొంచి ఉండడంతో ఏజెన్సీలోని విలీన మండలాల వాసుల్లో గుండె దడ మొదలైంది. ఇప్పటికే గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. గోదావరికి ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, సింగూరు, ఎల్లంపల్లి, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. దీంతో ఎగువ నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో గోదావరికి భారీగా వరద వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మరో రెండు రోజుల్లో వరద తీవ్రత ఏజెన్సీని చుట్టుముడుతుందని అనుమానిస్తున్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులు కూడా పొంగి ప్రవహిస్తున్నాయి. చింతూరు మండలం నుంచి ప్రవహించి కూనవరం వద్ద గోదావరి సంగమంలో కలిసే శబరి పోటెత్తితే చింతూరు మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. శబరి పోటు వల్ల గోదావరి వరద దిగువకు త్వరగా వెళ్లకపోవటంతో కూనవరం, ఎటపాక, వీఆర్ పురం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలకు వరద పోటెత్తే ప్రమాదం ఉంది. 2016 సెప్టెంబర్‌లో గోదావరికి వరద వస్తుందనే సమాచారంతో ఏజెన్సీ ప్రజలు భయపడుతున్నారు. వరదల వివరాలు 1966 – సెప్టెంబర్ 7– 65.9 అడుగుల నీటిమట్టం 1976– జులై 22 – 63.9 అడుగులు 1986– ఆగస్టు16 – 75.6 అడుగులు (ఇప్పటి వరకు ఇదే అత్యధికం) 1996– ఆగస్టులో 29.7 అడుగులు 2006– ఆగçస్టు8 – 66.9 అడుగులు -
నాటు సారా కాటు
వ్యసనానికి బానిసలై యువత నిర్వీర్యం బలవుతున్న కుటుంబాలు చిన్న వయస్సులోనే వితంతువులు అవుతున్న మహిళలు రాజమహేంద్రవరం క్రైం: సారా రక్కసికి యువత బలవుతోంది. నాటు సారాను నిర్మూలించే ధ్యేయంతో ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని రూపొందించినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. జిల్లా అంతటా నాటు సారా ఏరులై పారుతోంది. దీనికి అలవాటు పడిన కొందరు మృత్యువాత పడుతుండగా మరి కొందరు చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అవుతున్నారు. తక్కువ ధరకు లభిస్తున్న సారాకు బానిసలైనవారు కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరి తిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు, నరాల బలహీనతకు గురవుతున్నారు. కుటుంబాలను పోషించాల్సిన వారే మంచానికే పరిమితం కావడంతో వారు తమ కుటుంబాలకు భారమవుతున్నారు. ఇంటి యజమాని మంచం పట్టడంతో చిన్న వయస్సులోనే మహిళలపై ఆ కుటుంబ భారం పడుతోంది. పోలీసులకు చిక్కకుండా సారా తయారీ జిల్లాలో ఎక్కువగా గోదావరి లంకల్లోను, మెట్ట ప్రాంతంలోని తోటల్లోను, అటవీ ప్రాంతంలోనూ సారా తయారు చేస్తున్నారు. గోదావరి లంకల్లో సాగుతున్న సారా తయారీపై ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు దాడి చేయాలంటే పడవల్లో వెళ్లాల్సి వస్తోంది. దాంతో దాడులకు వస్తున్నట్టు ముందుగానే సారా తయారీదారులకు ఆ శాఖ సిబ్బందే సమాచారం ఇస్తున్నారు. పోలీసులు స్థావరానికి చేరేలోగానే సారా తయారీదారులు గప్‌చుప్‌గా తప్పించుకుంటున్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ స్థావరాల వద్దకు చేరే సరికి కొన్ని డ్రమ్ములు, సారా తయారీ పాత్రలు మాత్రమే దొరుగుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు సారా బట్టీలపై దాడులు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. సారా తయారీని అరికట్టడంలో ఎక్సైజ్, పోలీసు సిబ్బందిలో చిత్త శుద్ధి లోపిస్తోంది. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ పోలీసులు నెల నెలా వచ్చే మామూళ్లకు ఆశపడిన ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు సారా బట్టీలు, విక్రయదారులపై నామ మాత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవోదయం’ కార్యక్రమం సందర్భంగా ఎక్సైజ్ శాఖ విస్తృతంగా దాడులు నిర్వహించి సారా అమ్మకాలు, తయారీని కొంతమేర నిరోధించగలిగింది. ఆతర్వాత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలో సారా తయారీ, విక్రయాలు యథాతథ స్థితికి చేరుకున్నాయి. సారా తయారీ, అమ్మకాలను నిరోధించకుంటే సారా రక్కసికి మరింత మంది బలి అయ్యే అవకాశం ఉంది.