నాటు సారా కాటు
-
వ్యసనానికి బానిసలై యువత నిర్వీర్యం
-
బలవుతున్న కుటుంబాలు
-
చిన్న వయస్సులోనే వితంతువులు అవుతున్న మహిళలు
రాజమహేంద్రవరం క్రైం:
సారా రక్కసికి యువత బలవుతోంది. నాటు సారాను నిర్మూలించే ధ్యేయంతో ప్రభుత్వం ‘నవోదయం’ కార్యక్రమాన్ని రూపొందించినా అది సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. జిల్లా అంతటా నాటు సారా ఏరులై పారుతోంది. దీనికి అలవాటు పడిన కొందరు మృత్యువాత పడుతుండగా మరి కొందరు చిన్న వయస్సులోనే అనారోగ్యానికి గురై మంచానికే పరిమితం అవుతున్నారు. తక్కువ ధరకు లభిస్తున్న సారాకు బానిసలైనవారు కిడ్నీ, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరి తిత్తులు, గుండెకు సంబంధించిన సమస్యలు, నరాల బలహీనతకు గురవుతున్నారు. కుటుంబాలను పోషించాల్సిన వారే మంచానికే పరిమితం కావడంతో వారు తమ కుటుంబాలకు భారమవుతున్నారు. ఇంటి యజమాని మంచం పట్టడంతో చిన్న వయస్సులోనే మహిళలపై ఆ కుటుంబ భారం పడుతోంది.
పోలీసులకు చిక్కకుండా సారా తయారీ
జిల్లాలో ఎక్కువగా గోదావరి లంకల్లోను, మెట్ట ప్రాంతంలోని తోటల్లోను, అటవీ ప్రాంతంలోనూ సారా తయారు చేస్తున్నారు. గోదావరి లంకల్లో సాగుతున్న సారా తయారీపై ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు దాడి చేయాలంటే పడవల్లో వెళ్లాల్సి వస్తోంది. దాంతో దాడులకు వస్తున్నట్టు ముందుగానే సారా తయారీదారులకు ఆ శాఖ సిబ్బందే సమాచారం ఇస్తున్నారు. పోలీసులు స్థావరానికి చేరేలోగానే సారా తయారీదారులు గప్‌చుప్‌గా తప్పించుకుంటున్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఆ స్థావరాల వద్దకు చేరే సరికి కొన్ని డ్రమ్ములు, సారా తయారీ పాత్రలు మాత్రమే దొరుగుతున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు సారా బట్టీలపై దాడులు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. సారా తయారీని అరికట్టడంలో ఎక్సైజ్, పోలీసు సిబ్బందిలో చిత్త శుద్ధి లోపిస్తోంది.
మామూళ్ల మత్తులో ఎక్సైజ్ పోలీసులు
నెల నెలా వచ్చే మామూళ్లకు ఆశపడిన ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు సారా బట్టీలు, విక్రయదారులపై నామ మాత్రంగానే దాడులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవోదయం’ కార్యక్రమం సందర్భంగా ఎక్సైజ్ శాఖ విస్తృతంగా దాడులు నిర్వహించి సారా అమ్మకాలు, తయారీని కొంతమేర నిరోధించగలిగింది. ఆతర్వాత ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలో సారా తయారీ, విక్రయాలు యథాతథ స్థితికి చేరుకున్నాయి. సారా తయారీ, అమ్మకాలను నిరోధించకుంటే సారా రక్కసికి మరింత మంది బలి అయ్యే అవకాశం ఉంది.