పుట్టిన వెంటనే ఆధార్
-
ఘోషా ఆస్పత్రిలో శ్రీకారం
పాతపోస్టాఫీస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే ఆధార్ కార్డు’ విధానం పాతనగరం విక్టోరియా ఆస్పత్రి(ఘోషా ఆస్పత్రి)లో శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11.45 గంటలకు జన్మించిన ఆడSశిశువుకు, మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మించిన మగశిశువు తల్లులకు ఆధార్ సంఖ్యతో కూడిన పత్రాన్ని సూపరింటెండెంట్ పద్మలీల, సీఎస్‌ఆర్‌ఎంవో సావిత్రమ్మలు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో భాగంగా సీఎస్‌ఆర్‌ఎంవో రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తూ పుట్టిన శిశువుకు జనన ధ్రువీకరణ పత్రంలో పాటు ఆధార్ సంఖ్యను కేటాయిస్తారన్నారు. దీనిని తల్లి లేదా తండ్రి ఆధార్ నంబరుతో అనుసంధానిస్తారని తెలిపారు. నెలలోగా ఆధార్ కార్డు తపాల శాఖ ద్వారా ఇంటికి బట్వాడా అవుతుందన్నారు. పుట్టిన బిడ్డకు పేరు ఉండదు కనుక బేబీ ఆఫ్ అని తల్లి, తండ్రి పేర్లను నమోదు చేస్తామని చెప్పారు. బిడ్డకు పేరు పెట్టిన తరువాత దీన్ని మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఏడాది తరువాత ఆధార్ సెంటర్/ మీ సేవకు వెళ్లి బిడ్డ వేలి ముద్రలు, ఐరిస్, ఫొటోతో కూడిన ఆధార్ కార్డును తీసుకోవచ్చని సూచించారు. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ/ మున్సిపాలిటీ/కార్పొరేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ప్రసవం జరిగిన ప్రభుత్వాస్పత్రిలోనే డిశ్చార్జ్ అయ్యేలోగా ఆధార్‌ను ఇస్తామన్నారు.