GoSha Hospital
-
ఘోషా.. నిరాశ!
ప్రసవమంటే పునర్జన్మే అంటారు. అతివ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ జన్మించిన దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రసవానంతరం మాతాశిశువులను కంటికి రెప్పలా చూసుకుంటారు. అయితే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే ఘోషా ఆస్పత్రిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. కనీస సౌకర్యాలను అభివృద్ధి చెందించి అతివలకు మేలు చేయాల్సిన అవసరం ఉండగా, ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. హామీలైతే కుమ్మరిస్తున్నారు కానీ మాతృమూర్తులకు, నవజాత శిశువుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పాతపోస్టాఫీసు: ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరైన సదుపాయాలు కానరావడం లేదు. ఆస్పత్రికి 147 పడకల సామర్థ్యం ఉన్నా వైద్యాధికారులు 250 పడకలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మెరుగైన వైద్య సేవలకోసం ఇక్కడకు వస్తుంటారు. ప్రసూతి కేసులు అధికంగా వచ్చినపుడు మంచానికి ఇద్దరు వంతున బాలింతలను ఉంచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కన్నా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం వల్ల సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. హామీలు గాలికి.. గత ఏడాది ఫిబ్రవరి 17న ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం జరగలేదు కాని లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదే నెల 20న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏప్రిల్ 4న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆస్పత్రిని సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించి పలు హామీలను గుప్పించారు. అవి ఒక్కటి కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు. ఇవీ వాగ్దానాలు ♦రూ. 20 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో ఉన్న ఖాళీ స్థలంలో 100 పడకల మాతాశిశు ఆస్పత్రిని నిర్మిస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మే 31కి శంకుస్థాపన జరిగుతుందని, 18 నెలల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ♦అందుబాటులో ఉన్న నిధులతో ఆస్పత్రిలో శిథిలమైపోయిన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు భూగర్భ ౖడ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు. ♦ఆస్పత్రి అభివృద్ధికి వుడా రూ.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఆ నిధులు ఏమైపోయాయో తెలియదు. ♦రూ. 28 లక్షల వ్యయంతో 315 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని చెప్పి నెలలు గడిచాయి. ♦రూ. 22.6 లక్షల వ్యయంతో నవజాత శిశువుల విభాగానికి ఎయిర్ కంప్రెసర్, సీసీ రోడ్ల నిర్మాణం, కొత్త ఆంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని ♦ఇక్కడ మరుగుదొడ్ల కొరతను తీర్చేందుకు జీవీఎంసీకి మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యతను అప్పగిస్తామని అన్నారు. ♦పూర్తి స్థాయిలో ఆస్పత్రిలో అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు. ♦శాశ్వత ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్, ప్లంబర్ల నియామకం జరుగుతుందని తెలిపారు. ఇవీ వాస్తవాలు.. ♦ఆస్పత్రిలో వినియోగిస్తున్న ట్రాన్స్ఫార్మర్కు కాలం చెల్లింది. దీని సామర్థ్యాన్ని మించి విద్యుత్‌ను ఆస్పత్రి వినియోగించడం వల్ల విద్యుత్ బల్బులు ఎప్పటికప్పుడు మాడిపోతున్నాయి. చిన్నచిన్న పరికరాలు కాలిపోతున్నాయి. 47 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రతి రోజు 80 కిలోవాట్లను వాడుతున్నారు. ♦ఇక్కడి సీసీ రోడ్లు శిథిలమై సంవత్సరాలు గడుస్తున్నా నూతనంగా రోడ్లను వేసేందుకు తగిన నిధులు లేకపోవడం వల్ల గతుకులు పడిన రోడ్లతో అంతా అవస్థలు పడుతున్నారు. ♦ప్రతి రోజు సుమారు 100 మంది ఔట్ పేషెంట్లు ఆస్పత్రికి వస్తుంటారు. వీరితో పాటు ఆస్పత్రిలో చేరిన రోగులు, వారి సహాయకులు మరొ 200 వరకూ ఉంటారు. వీరందరి వినియోగానికి సరిపడా మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఆస్పత్రి ఆవరణలో ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న సులాభ్ కాంప్లెక్స్మీద వీరంతా ఆధారపడవలసి వస్తుంది. దీంతో మరుగు వెళ్లేందుకు మహిళలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ♦నవజాత శిశువుల విభాగంలో అగ్నిమాపక యంత్రాలకు బదులు చిన్న పరిమాణంలో ఉన్న పరికరాలు అమర్చారు. వీటివల్ల ప్రయోజనం పరిమితమే. ♦ఆస్పత్రిలో పడకల సామర్థ్యం కన్నా అదనంగా మంచాలను వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏర్పాటు చేసిన పడకలతో పాటు నవజాత శిశువుల విభాగపు కింది భాగంలో మంచాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆ విభాగపు తొలి అంతస్తుకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై కూడా మంచాలు వేశారు. ♦రోగుల సంఖ్యను బట్టి 31 మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా ప్రస్తుతం 18 మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, అంబులెన్స్ డ్రైవర్, ఫ్యామిలీ ప్లానింగ్ వెల్పేర్ వర్కర్, గార్డెనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరానికి సరిపడా నాలుగో తరగతి సిబ్బంది లేరు. ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ అధికారి పోస్టు ఆరు నెలలుగా, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టు గత ఏడాది ఎనిమిది నెలలుగా,, హాస్పిటల్ మేనేజర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్నాయి. -
పుట్టిన వెంటనే ఆధార్
ఘోషా ఆస్పత్రిలో శ్రీకారం పాతపోస్టాఫీస్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన ‘బిడ్డ పుట్టిన 24 గంటల్లోనే ఆధార్ కార్డు’ విధానం పాతనగరం విక్టోరియా ఆస్పత్రి(ఘోషా ఆస్పత్రి)లో శ్రీకారం చుట్టారు. ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11.45 గంటలకు జన్మించిన ఆడSశిశువుకు, మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మించిన మగశిశువు తల్లులకు ఆధార్ సంఖ్యతో కూడిన పత్రాన్ని సూపరింటెండెంట్ పద్మలీల, సీఎస్‌ఆర్‌ఎంవో సావిత్రమ్మలు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో భాగంగా సీఎస్‌ఆర్‌ఎంవో రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తూ పుట్టిన శిశువుకు జనన ధ్రువీకరణ పత్రంలో పాటు ఆధార్ సంఖ్యను కేటాయిస్తారన్నారు. దీనిని తల్లి లేదా తండ్రి ఆధార్ నంబరుతో అనుసంధానిస్తారని తెలిపారు. నెలలోగా ఆధార్ కార్డు తపాల శాఖ ద్వారా ఇంటికి బట్వాడా అవుతుందన్నారు. పుట్టిన బిడ్డకు పేరు ఉండదు కనుక బేబీ ఆఫ్ అని తల్లి, తండ్రి పేర్లను నమోదు చేస్తామని చెప్పారు. బిడ్డకు పేరు పెట్టిన తరువాత దీన్ని మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఏడాది తరువాత ఆధార్ సెంటర్/ మీ సేవకు వెళ్లి బిడ్డ వేలి ముద్రలు, ఐరిస్, ఫొటోతో కూడిన ఆధార్ కార్డును తీసుకోవచ్చని సూచించారు. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాల కోసం పంచాయతీ/ మున్సిపాలిటీ/కార్పొరేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదన్నారు. ప్రసవం జరిగిన ప్రభుత్వాస్పత్రిలోనే డిశ్చార్జ్ అయ్యేలోగా ఆధార్‌ను ఇస్తామన్నారు. -
సమయానికి రాని డాక్టర్లు.. గర్భిణీల ఇబ్బందులు
-
సమయానికి రాని డాక్టర్లు.. గర్భిణీల ఇబ్బందులు
విశాఖ: నగరంలోని ఘోషా ఆస్పత్రిలో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం పరీక్షల నిమిత్తం వచ్చిన ఆ స్త్రీలు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ఎండ వేడిని తట్టుకోలేక పడిపోయారు. ఆస్పత్రికి వచ్చిన గర్భిణీలకు అక్కడ డాక్టర్లు కనిపించలేదు. 10 గం.లకు రావాల్సిన డాక్టర్లు సమయానికి అక్కడకు రాకపోవడంతో గర్భిణీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా క్యూలైన్లో నిల్చొని ఉన్న నలుగురు వేడిని తట్టుకోలేక సొమ్ముసిల్లి పడిపోయారు. ఆస్పత్రికి వైద్యులు తగిన సమయంలో రాకపోవడంతో వందలాది మంది గర్భిణీలు లైన్లలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఒక పసికందు మృతి చెందింది.ఆ మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆ బిడ్డ బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పుట్టినా తమకు చూపించలేదని, అసలు పసికందుకు వైద్యం చేయలేదంటూ ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. -
మరో వివాదంలో ‘ఘోషా’
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : వివాదాలకు కేంద్ర బిందువైన ఘోషా ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. సోమవారం ఉదయం ఘోషాలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ)లో ఇద్దరు శిశువులు మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని శిశువుల మృతికి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్రకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని గాజులరేగ రాళ్లవీధికి చెందిన షేక్ స్వాతి ఈ నెల 9వ తేదీన ప్రసవం కోసం ఘోషా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవమైంది. ఆమెకు ఇదే తొలికాన్పు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో వైద్యులు చేర్చించారు. ఉమ్మనీరు తాగిందని వైద్యులు శిశువును వార్మర్లో పెట్టి చికిత్స అందించారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శిశువు మృతి చెందింది. అదే విధంగా పూసపాటిరేగ మండలం చినపతివాడకు చెందిన తమటాపు జయలక్ష్మి ఈ నెల 10న ప్రసవం కోసం ఘోషాలో చేరింది. 11వ తేదీ ఉదయం సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమెకు కూడా ఇదే తొలికాన్పు. ఈ శిశువుకు కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఎస్‌ఎన్‌సీయూలో చేర్పించారు. ఈ శిశువు కూడా చికిత్స పొందు తూ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎస్ఎన్సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది బయటకు రాకుండా లోపలే ఉండిపోయారు. చివరకు ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడంతో రోగి బంధువులు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందింది.. ‘మొదటి రోజు బిడ్డ ఉమ్మనీరు తాగిందన్నారు. రెండో రోజు ఆయాసం ఉందని చెప్పారు. మూడో రోజు ఉబ్బసం ఉందని చెప్పారు. నాలుగో రోజు గుండెకు రంధ్రం పడిందన్నారు. ఆదివారం వరకూ పాప బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం వచ్చి శిశువు మృతి చెందిందన్నారు.’ అంటూ ఆడ శిశువు తండ్రి షేక్ అల్లా బక్సుద్ భోరుమన్నాడు. పాప పరిస్థితి ఎలా ఉందని పదేపదే అడిగినా చెప్పేవారు కాదని, ప్రైవేట ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా వినలేదని వాపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు. సిబ్బంది అలసత్వం వల్లే.. ‘బిడ్డ పుట్టిన పది నిమిషాల్లోనే పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు రోజుల తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారు. బాబు పరిస్థితి గురించి అడిగినా చెప్పేవారు కాదు. బాబు మృతి చెందడానికి సిబ్బంది అలసత్వమే కారణమ’ని మగశిశువు తండ్రి టి.రామారావు ఆరోపించాడు. వైద్యుని వివరణ ఇద్దరు శిశువులకూ పరిస్థితి విషమంగా ఉందని ముందే చెప్పామని ఘోషా ఆస్పత్రి పిల్లల వైద్యుడు బి.రవీంద్రబాబు చెప్పారు. స్వాతికి జన్మించిన శిశువు పుట్టగానే ఏడవలేదని, దీనికితోడు గుండెకు రంధ్రం పడి మెదడుకు శ్వాస అందక చనిపోయిందని తెలిపారు. మలం తాగేయడం వల్ల ఇన్ఫెక్షన్ సోకి జయలక్ష్మి శిశువు మృతి చెందినట్లు చెప్పారు. శిశువుల మృతిపై ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామని ఘోషా సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. శిశువుల మృతిపై విచారణ శిశువుల మృతిపై కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, ఇన్చార్జ్ ఆర్ఎంఓ బి.సత్యశ్రీనివాస్ సోమవారం సాయంత్రం విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల బంధువులతో బుధవారం మాట్లాడుతామని అధికారులు తెలిపారు. వైద్యుల తప్పు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘ఘోషా’లో కానరాని సౌకర్యాలు విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఘోషా ఆస్పత్రిలో అధికారుల అలసత్వం.. సౌకర్యాల లేమి వల్ల చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలోని సమస్యలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించడం లేదు. సంఘటనలు జరిగి నప్పుడు మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఆస్పత్రిలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో సోమవారం ఉదయం ఇద్దరు శిశువులు మృతి చెందారు. వెంటిలేటర్లు లేకపోవడం, వైద్యుల కొరత వల్లే చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ ఉన్నట్లయితే శిశువును బతికించగలిగేవారమని ఎస్ ఎన్సీయూకు చెందిన వైద్యు డు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారులకు పలుమార్లు చెప్పినా వెంటిలేటర్లు మంజూరు చేయలేదని చెప్పారు. ఎస్ఎన్సీయూ యూనిట్లో కనీసం ఆరు వరకూ వెంటిలేటర్లు ఉండాలి. అయితే ఒకటి కూడా ఇక్కడ లేదు. ఈ యూనిట్లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శిశువులకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు లేకుండా ఎలా అనుమతి ఇస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిశువులకు ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ కూడా గత ఏడాది కాలంగా పని చేయడం లేదు. గత ఏడాది కూడా శిశువు మృతి గత ఏడాది కూడా ఇక్కడ ఓ శిశువు మృతి చెందింది. దీనిపై ధర్మపురికి చెందిన శిశువు బంధువులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. పిల్లల వైద్యుల కొరత ఘోషా ఆస్పత్రిలో నలుగురు పిల్లల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉన్నారు. సాయంత్ర ఆరు గంటలు దాటిన తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం అందడంలో జాప్యం వల్లే శిశువులు మృతి చెందినట్లు సమాచారం. తర చూ ఇటువంటి సంఘటనలు ఇక్క డ జరుగుతున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు.