మరో వివాదంలో ‘ఘోషా’ | GoSha Hospital Another controversy | Sakshi
Sakshi News home page

మరో వివాదంలో ‘ఘోషా’

Published Tue, Jan 14 2014 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

GoSha Hospital Another controversy

విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : వివాదాలకు కేంద్ర బిందువైన ఘోషా ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. సోమవారం ఉదయం ఘోషాలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం(ఎస్‌ఎన్‌సీయూ)లో ఇద్దరు శిశువులు మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని శిశువుల మృతికి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ రవిచంద్రకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని గాజులరేగ రాళ్లవీధికి చెందిన షేక్ స్వాతి ఈ నెల 9వ తేదీన ప్రసవం కోసం ఘోషా ఆస్పత్రిలో చేరింది. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవమైంది. ఆమెకు ఇదే తొలికాన్పు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రిలో ఉన్న ఎస్‌ఎన్‌సీయూలో వైద్యులు చేర్చించారు. ఉమ్మనీరు తాగిందని వైద్యులు శిశువును వార్మర్‌లో పెట్టి చికిత్స అందించారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో శిశువు మృతి చెందింది. అదే విధంగా పూసపాటిరేగ మండలం చినపతివాడకు చెందిన తమటాపు జయలక్ష్మి ఈ నెల 10న ప్రసవం కోసం ఘోషాలో చేరింది. 11వ తేదీ ఉదయం సాధారణ ప్రసవం ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమెకు కూడా ఇదే తొలికాన్పు. ఈ శిశువుకు కూడా ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఎస్‌ఎన్‌సీయూలో చేర్పించారు. ఈ శిశువు కూడా చికిత్స పొందు తూ సోమవారం ఉదయం మృతి చెందాడు.
 
 ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
 వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువులు మృతి చెందారని బంధువులు సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఆస్పత్రి సిబ్బంది బయటకు రాకుండా లోపలే ఉండిపోయారు. చివరకు ఆస్పత్రి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడంతో రోగి బంధువులు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
 
 వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందింది..
 ‘మొదటి రోజు బిడ్డ ఉమ్మనీరు తాగిందన్నారు. రెండో రోజు ఆయాసం ఉందని చెప్పారు. మూడో రోజు ఉబ్బసం ఉందని చెప్పారు. నాలుగో రోజు  గుండెకు రంధ్రం పడిందన్నారు. ఆదివారం వరకూ పాప బాగానే ఉందని చెప్పారు. ఈ రోజు ఉదయం వచ్చి శిశువు మృతి చెందిందన్నారు.’ అంటూ ఆడ శిశువు తండ్రి షేక్ అల్లా బక్సుద్ భోరుమన్నాడు. పాప పరిస్థితి ఎలా ఉందని పదేపదే అడిగినా చెప్పేవారు కాదని, ప్రైవేట ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా వినలేదని వాపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాడు.
 
 సిబ్బంది అలసత్వం వల్లే..
 ‘బిడ్డ పుట్టిన పది నిమిషాల్లోనే పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు రోజుల తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారు. బాబు పరిస్థితి గురించి అడిగినా చెప్పేవారు కాదు. బాబు మృతి చెందడానికి సిబ్బంది అలసత్వమే కారణమ’ని మగశిశువు తండ్రి టి.రామారావు ఆరోపించాడు.
 
 వైద్యుని వివరణ
 ఇద్దరు శిశువులకూ పరిస్థితి విషమంగా ఉందని ముందే చెప్పామని ఘోషా ఆస్పత్రి పిల్లల వైద్యుడు బి.రవీంద్రబాబు చెప్పారు. స్వాతికి జన్మించిన శిశువు పుట్టగానే ఏడవలేదని, దీనికితోడు గుండెకు రంధ్రం పడి మెదడుకు శ్వాస అందక చనిపోయిందని తెలిపారు. మలం తాగేయడం వల్ల ఇన్‌ఫెక్షన్ సోకి జయలక్ష్మి శిశువు మృతి చెందినట్లు చెప్పారు. శిశువుల మృతిపై ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామని ఘోషా సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
 
 శిశువుల మృతిపై విచారణ
 శిశువుల మృతిపై కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు, ఇన్‌చార్జ్ ఆర్‌ఎంఓ బి.సత్యశ్రీనివాస్ సోమవారం సాయంత్రం విచారణ చేపట్టారు. సంఘటన జరిగిన తీరుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శిశువుల బంధువులతో బుధవారం మాట్లాడుతామని అధికారులు తెలిపారు. వైద్యుల తప్పు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
 
 ‘ఘోషా’లో కానరాని సౌకర్యాలు
 విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఘోషా ఆస్పత్రిలో అధికారుల అలసత్వం.. సౌకర్యాల లేమి వల్ల చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రిలోని సమస్యలపై పలుమార్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించడం లేదు. సంఘటనలు జరిగి నప్పుడు మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఆస్పత్రిలోని నవజాతి శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)లో సోమవారం ఉదయం ఇద్దరు శిశువులు మృతి చెందారు. వెంటిలేటర్లు లేకపోవడం, వైద్యుల కొరత వల్లే చిన్నారులు మరణించినట్లు తెలుస్తోంది. వెంటిలేటర్ ఉన్నట్లయితే శిశువును బతికించగలిగేవారమని ఎస్ ఎన్‌సీయూకు చెందిన వైద్యు డు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అధికారులకు పలుమార్లు చెప్పినా వెంటిలేటర్లు మంజూరు చేయలేదని చెప్పారు. ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌లో కనీసం ఆరు వరకూ వెంటిలేటర్లు ఉండాలి. అయితే ఒకటి కూడా ఇక్కడ లేదు. ఈ యూనిట్‌లో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శిశువులకు చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్లు, వైద్యులు లేకుండా ఎలా అనుమతి ఇస్తారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శిశువులకు ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆక్సిజన్ కూడా గత  ఏడాది కాలంగా పని చేయడం లేదు.
 
 గత ఏడాది కూడా శిశువు మృతి
 గత ఏడాది కూడా ఇక్కడ ఓ శిశువు మృతి చెందింది. దీనిపై ధర్మపురికి చెందిన శిశువు బంధువులు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
 
 పిల్లల వైద్యుల కొరత
 ఘోషా ఆస్పత్రిలో నలుగురు పిల్లల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వారిలో ఒకరు మెడికల్ లీవ్‌లో ఉన్నారు. ఎస్‌ఎన్‌సీయూలో నలుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా.. ఇద్దరు మాత్రమే ఉన్నారు. సాయంత్ర ఆరు గంటలు దాటిన తర్వాత వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం అందడంలో జాప్యం వల్లే శిశువులు మృతి చెందినట్లు సమాచారం. తర చూ ఇటువంటి సంఘటనలు ఇక్క డ జరుగుతున్నా సిబ్బందిలో మాత్రం మార్పు రావడం లేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement