ప్రసవమంటే పునర్జన్మే అంటారు. అతివ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ జన్మించిన దాకా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రసవానంతరం మాతాశిశువులను కంటికి రెప్పలా చూసుకుంటారు. అయితే.. ఇన్ని జాగ్రత్తలు తీసుకునే ఘోషా ఆస్పత్రిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. కనీస సౌకర్యాలను అభివృద్ధి చెందించి అతివలకు మేలు చేయాల్సిన అవసరం ఉండగా, ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు. హామీలైతే కుమ్మరిస్తున్నారు కానీ మాతృమూర్తులకు, నవజాత శిశువుల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
పాతపోస్టాఫీసు: ప్రభుత్వ విక్టోరియా (ఘోషా) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు సరైన సదుపాయాలు కానరావడం లేదు. ఆస్పత్రికి 147 పడకల సామర్థ్యం ఉన్నా వైద్యాధికారులు 250 పడకలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మెరుగైన వైద్య సేవలకోసం ఇక్కడకు వస్తుంటారు. ప్రసూతి కేసులు అధికంగా వచ్చినపుడు మంచానికి ఇద్దరు వంతున బాలింతలను ఉంచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య కన్నా సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండడం వల్ల సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి.
హామీలు గాలికి..
గత ఏడాది ఫిబ్రవరి 17న ఆస్పత్రిలోని నవజాత శిశువుల వార్డులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రాణ నష్టం జరగలేదు కాని లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. అదే నెల 20న ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏప్రిల్ 4న ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆస్పత్రిని సందర్శించి సమీక్ష సమావేశం నిర్వహించి పలు హామీలను గుప్పించారు. అవి ఒక్కటి కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు.
ఇవీ వాగ్దానాలు
♦రూ. 20 కోట్ల వ్యయంతో ఆస్పత్రిలో ఉన్న ఖాళీ స్థలంలో 100 పడకల మాతాశిశు ఆస్పత్రిని నిర్మిస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ మే 31కి శంకుస్థాపన జరిగుతుందని, 18 నెలల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
♦అందుబాటులో ఉన్న నిధులతో ఆస్పత్రిలో శిథిలమైపోయిన సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు భూగర్భ ౖడ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని చెప్పారు.
♦ఆస్పత్రి అభివృద్ధికి వుడా రూ.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఆ నిధులు ఏమైపోయాయో తెలియదు.
♦రూ. 28 లక్షల వ్యయంతో 315 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పి నెలలు గడిచాయి.
♦రూ. 22.6 లక్షల వ్యయంతో నవజాత శిశువుల విభాగానికి ఎయిర్ కంప్రెసర్, సీసీ రోడ్ల నిర్మాణం, కొత్త ఆంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని
♦ఇక్కడ మరుగుదొడ్ల కొరతను తీర్చేందుకు జీవీఎంసీకి మరుగుదొడ్ల నిర్మాణం బాధ్యతను అప్పగిస్తామని అన్నారు.
♦పూర్తి స్థాయిలో ఆస్పత్రిలో అగ్నిమాపక యంత్రాల ఏర్పాటు జరుగుతుందన్నారు.
♦శాశ్వత ప్రాతిపదికన ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌ల నియామకం జరుగుతుందని తెలిపారు.
ఇవీ వాస్తవాలు..
♦ఆస్పత్రిలో వినియోగిస్తున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కాలం చెల్లింది. దీని సామర్థ్యాన్ని మించి విద్యుత్‌ను ఆస్పత్రి వినియోగించడం వల్ల విద్యుత్ బల్బులు ఎప్పటికప్పుడు మాడిపోతున్నాయి. చిన్నచిన్న పరికరాలు కాలిపోతున్నాయి. 47 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ప్రతి రోజు 80 కిలోవాట్లను వాడుతున్నారు.
♦ఇక్కడి సీసీ రోడ్లు శిథిలమై సంవత్సరాలు గడుస్తున్నా నూతనంగా రోడ్లను వేసేందుకు తగిన నిధులు లేకపోవడం వల్ల గతుకులు పడిన రోడ్లతో అంతా అవస్థలు పడుతున్నారు.
♦ప్రతి రోజు సుమారు 100 మంది ఔట్ పేషెంట్లు ఆస్పత్రికి వస్తుంటారు. వీరితో పాటు ఆస్పత్రిలో చేరిన రోగులు, వారి సహాయకులు మరొ 200 వరకూ ఉంటారు. వీరందరి వినియోగానికి సరిపడా మరుగుదొడ్ల సదుపాయం లేదు. ఆస్పత్రి ఆవరణలో ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్న సులాభ్ కాంప్లెక్స్‌మీద వీరంతా ఆధారపడవలసి వస్తుంది. దీంతో మరుగు వెళ్లేందుకు మహిళలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.
♦నవజాత శిశువుల విభాగంలో అగ్నిమాపక యంత్రాలకు బదులు చిన్న పరిమాణంలో ఉన్న పరికరాలు అమర్చారు. వీటివల్ల ప్రయోజనం పరిమితమే.
♦ఆస్పత్రిలో పడకల సామర్థ్యం కన్నా అదనంగా మంచాలను వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రసూతి విభాగంలో ఏర్పాటు చేసిన పడకలతో పాటు నవజాత శిశువుల విభాగపు కింది భాగంలో మంచాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఆ విభాగపు తొలి అంతస్తుకు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై కూడా మంచాలు వేశారు.
♦రోగుల సంఖ్యను బట్టి 31 మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా ప్రస్తుతం 18 మాత్రమే పనిచేస్తున్నారు. ఇప్పటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, అంబులెన్స్ డ్రైవర్, ఫ్యామిలీ ప్లానింగ్ వెల్పేర్ వర్కర్, గార్డెనర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవసరానికి సరిపడా నాలుగో తరగతి సిబ్బంది లేరు. ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ అధికారి పోస్టు ఆరు నెలలుగా, ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టు గత ఏడాది ఎనిమిది నెలలుగా,, హాస్పిటల్ మేనేజర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment