రోడ్డుపై ప్రసవ వేదన
♦ దిక్కులేని స్థితిలోప్రసవం
♦ బాసటగా నిలిచిన జిమ్ యువకులు
తాడేపల్లిగూడెం రూరల్ : ఏ మృగాడి అకృత్యమో.. ఆమె పాలిట శాపంగా మారింది. నవమాసాలు నిండిన ఆమె దిక్కులేని స్థితిలో ప్రసవ వేదనతో అల్లాడిపోయింది. ఎట్టకేలకు మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బీ బంగ్లా వెనుక బేతేలు చర్చి ఎదురుగా ఉన్న రోడ్డులో చోటుచేసుకుంది. ప్రసవ వేదనతో కొట్టుమిట్టాడుతున్న ఆమె (పేరు తెలియని మహిళ)ను ఉదయం జిమ్‌కు వెళ్తున్న ఒక అధ్యాపకుడు చూసి జిమ్‌లోని యువకులకు చెప్పాడు.
యువకులు కొలు కుల మోహన్, గండి వెంకటేష్, వెంకటరత్నం ఆర్‌ఎంపీ డాక్టర్ రాజు సహకారంతో ఆమెకు సపర్యలు చేశారు. ఆమె అక్కడే మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమెను, శిశువును 108లో తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.