గుంటూరు : ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని వెలగపూడికి కార్యాలయాల తరలింపు ముమ్మరం చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి గుంటూరు జిల్లాలోని వెలగపూడి నుంచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ (సాధారణ పరిపాలన విభాగం) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే ఆర్థికశాఖ ఫైల్ వెలగపూడికి చేరింది. ప్రభుత్వ ఫైళ్ల తరలింపు ఇదే తొలిసారి. కాగా అయిదు భవనాల్లో ప్రభుత్వ శాఖలకు విభాగాలు కేటాయిస్తూ జీవో జారీ అయింది. మొదటి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో జీఏడీకి, మిగిలిన నాలుగు భవనాలు అన్ని శాఖలకు ప్రభుత్వం కేటాయించింది. కాగా ఏపీ పాలన వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్లో సెంట్రల్ రికార్డ్ రూమ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.