- గానకోకిల సుశీల
- అలరించిన ఆ’పాత’మధురాలు
నన్ను ప్రోత్సహించింది బాలమురళియే
Published Sun, Nov 27 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
రాజమహేంద్రవరం కల్చరల్ :
‘సినీగాయనిగా తొలిసారి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ప్రస్తుతం నాకు సత్కారం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై బాలమురళి కూర్చున్నట్టు భావించి, ఆ కుర్చీకి దండలు వేయండ’ని ప్రముఖ గాయని, గానకోకిల సుశీల కోరారు. శుభోదయమ్ ఇ¯ŒS ఫ్రా ఆధ్వర్యంలో గోదావరి సింగర్స్ క్లబ్ సౌజన్యంతో శ్రీహరి ఈవెంట్స్ ఆనం కళాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన సినీ సంగీత విభావరిలో నాటి మేటి గాయని సుశీల ముఖ్య అతిథిగా మాట్లాడారు. బాలమురళి కన్నుమూశారని, ఈ పరిస్థితుల్లో కంటినీరు ఆరకుండా ఈ సత్కారాలు తీసుకోవడం తనకు ఇష్టంలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆమెకు నిర్దేశించిన ఆసనానికి పూలమాలలు వేశాక, పక్కనే మరో సాధారణ ఆసనంపై ఆమె కూర్చున్నారు. నిర్వాహకులు అమెకు జ్ఞాపికను అందజేశారు. బాలమురళి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
కొలువుతీరిన సంగీతలక్ష్మి
మూడున్నర దశాబ్దాలుగా అన్ని దక్షిణాది భాషల్లో అందరు కథా నాయికలకు తన గాన మాధుర్యాన్ని అందించిన సుశీల సన్నిధిలో ఔత్సాహిక గాయనీ గాయకులు ఆమె పాడిన పాటలనే ఆలపించారు. సుశీల మౌనంగా కూర్చుని, తన్మయత్వంతో ఆ పాటలను విన్నారు. కొన్ని పాటలకు తన కరతాళ ధ్వనులతో అభినందించారు. సమీర్ భరద్వాజ్, యామిని, పిరాట్ల శ్రీహరి, శ్రియ తదితరులు ఆపాత మధురాలను వినిపించారు. తొలుత సుశీలను వేదస్వస్తితో, పూర్ణకుంభంతో వేదిక వద్దకు తీసుకువచ్చారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి హాజరయ్యారు. కలపటపు లక్ష్మిప్రసాద్, రాయుడు చంద్రకుమార్, సన్నిధానం శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.
ఘంటసాల విగ్రహం వద్ద నివాళి
గోదావరి గట్టున ఉన్న అమర గాయకుడు ఘంటసాల విగ్రహం వద్ద ఆదివారం ఉదయం సుశీల నివాళులర్పించారు.
Advertisement
Advertisement