గజ్వేల్‌లో వంకాయ తోటల సాగు
- వంకాయ తోటల్లో సస్యరక్షణ తప్పనిసరి
- తెగుళ్ల నివారణపై అప్రమత్తంగా ఉండాలి
- గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి సలహాలు, సూచనలు
గజ్వేల్: వంకాయ తోటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతూ పంటను కాపాడుకోవాలని గజ్వేల్ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి (సెల్: 83744 49345) సూచించారు. సమగ్ర సస్యరక్షణ చర్యలపై ఆయన సలహాలు, సూచనలు మీకోసం...
మొవ్వు, కాయ తొలుచు పురుగు
మొక్కలు నాటిన 30-40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, ఆ తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివరన పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లను తుంచివేసి కార్బరిల్ 50శాతం డబ్ల్యూపీ 3 గ్రాములు లేదా ఫ్రొఫెనోఫాస్ 2మి,లీ లేదా సైపర్‌మెత్రిన్ 1మి.లీ. లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు
ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకుని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథోయెట్ లేదా మిథైల్ డెమోటాన్ లేదా పిప్రోనిల్ లీటరు నీటికి 2 మి.లీల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఎక్కువగా ఉంటే ఎసిఫేట్ 1.5 గ్రాము చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎర్రనల్లి
ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలేగూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి.. నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5మి.లీ. లేదా స్పైరో మెసిఫేన్ 3 మి.లీ. లేదా ప్రొపర్‌గైట్ 3 మి.లీల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
నులి పురుగులు
ఈ పురుగులు ఆశించిన పంట వేళ్లపై వేరుబుడిపెలు కనబడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా, తక్కువ కాయలు కాస్తాయి. వీటిని తట్టుకునే రకాలైన బ్లాక్ బ్యూటీ, విజయ, బనారస్ జాయింట్, టీ-2లను సాగు చేయాలి. పొలంలో నులి పురుగుల సంతతిని తగ్గించడానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో ఏడాదిపాటు బంతిపూల పంటను మార్పిడి చేయాలి.
ఆకుమాడు తెగులు
నారును పొలంలో నాటిన తర్వాత సుమారు 30రోజులకు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెట్ 2.5గ్రాములు లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి 10రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు
ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు బొడ్డువాలిపోతాయి. ఇది వైరస్ తెగులు. ఈ వైరస్‌ను పచ్చదోమ వ్యాపింపజేస్తుంది. తెగుళ్లను వ్యాపింపజేసే పచ్చదోమల్ని మిథైల్ డెమటాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు నాశనం చేయాలి. నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత రెండో దఫాగా ఎకరాకు 8కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేయాలి.
నాటే ముందు నారు వేళ్లను 1000 పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకుని, నాటిన 4-5 వారాల తర్వాత 7-10 రోజుల వ్యవధిలో డైమిథోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2మి,లీ లీటరు నీటిలో కలిపి మూడుసార్లు పిచికారీ చేయాలి. పొలంలో వెర్రి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను తొలగించి జిబ్బరిల్లిక్ ఆమ్లము 50 మిల్లీ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు ఉధృతి తగ్గుతుంది.