brinjal crop
-
కూరగాయల్లో వంకాయకు అధిక డిమాండ్
-
ఇలా పండిస్తే గుత్తివంకాయ పంటతో ఆదాయమే ఆదాయం..!
-
వంకాయ సాగు.. భలే బాగు
వంకాయ తోటల్లో సస్యరక్షణ తప్పనిసరి తెగుళ్ల నివారణపై అప్రమత్తంగా ఉండాలి గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణి సలహాలు, సూచనలు గజ్వేల్: వంకాయ తోటల్లో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతూ పంటను కాపాడుకోవాలని గజ్వేల్ ఉద్యాన శాఖ అధికారి చక్రపాణి (సెల్: 83744 49345) సూచించారు. సమగ్ర సస్యరక్షణ చర్యలపై ఆయన సలహాలు, సూచనలు మీకోసం... మొవ్వు, కాయ తొలుచు పురుగు మొక్కలు నాటిన 30-40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, ఆ తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలగజేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివరన పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లను తుంచివేసి కార్బరిల్ 50శాతం డబ్ల్యూపీ 3 గ్రాములు లేదా ఫ్రొఫెనోఫాస్ 2మి,లీ లేదా సైపర్మెత్రిన్ 1మి.లీ. లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకుని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథోయెట్ లేదా మిథైల్ డెమోటాన్ లేదా పిప్రోనిల్ లీటరు నీటికి 2 మి.లీల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ ఎక్కువగా ఉంటే ఎసిఫేట్ 1.5 గ్రాము చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎర్రనల్లి ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలేగూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి.. నీటిలో కరిగే గంధకం 3గ్రాములు లేదా డైకోఫాల్ 5మి.లీ. లేదా స్పైరో మెసిఫేన్ 3 మి.లీ. లేదా ప్రొపర్గైట్ 3 మి.లీల చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. నులి పురుగులు ఈ పురుగులు ఆశించిన పంట వేళ్లపై వేరుబుడిపెలు కనబడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా, తక్కువ కాయలు కాస్తాయి. వీటిని తట్టుకునే రకాలైన బ్లాక్ బ్యూటీ, విజయ, బనారస్ జాయింట్, టీ-2లను సాగు చేయాలి. పొలంలో నులి పురుగుల సంతతిని తగ్గించడానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో ఏడాదిపాటు బంతిపూల పంటను మార్పిడి చేయాలి. ఆకుమాడు తెగులు నారును పొలంలో నాటిన తర్వాత సుమారు 30రోజులకు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ తెగులు సోకినప్పుడు ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెట్ 2.5గ్రాములు లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లీటరు నీటిలో కలిపి 10రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు బొడ్డువాలిపోతాయి. ఇది వైరస్ తెగులు. ఈ వైరస్ను పచ్చదోమ వ్యాపింపజేస్తుంది. తెగుళ్లను వ్యాపింపజేసే పచ్చదోమల్ని మిథైల్ డెమటాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు నాశనం చేయాలి. నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత రెండో దఫాగా ఎకరాకు 8కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేయాలి. నాటే ముందు నారు వేళ్లను 1000 పీపీఎం టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకుని, నాటిన 4-5 వారాల తర్వాత 7-10 రోజుల వ్యవధిలో డైమిథోయెట్ లేదా మిథైల్ డెమటాన్ 2మి,లీ లీటరు నీటిలో కలిపి మూడుసార్లు పిచికారీ చేయాలి. పొలంలో వెర్రి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను తొలగించి జిబ్బరిల్లిక్ ఆమ్లము 50 మిల్లీ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు ఉధృతి తగ్గుతుంది. -
వంగ బంగారమే
* సీతాఫలం, కలబంద, వేపాకుల కషాయంతో పురుగులు పరారీ * సింథటిక్ రసాయనాల అవసరం లేదు * ప్రకృతి సేద్య పద్ధతిలో పూర్తిగా విషరహితమైన పంట * సేంద్రియ ఎరువుతో దీటైన దిగుబడి ఎప్పుడో ఏళ్లనాటి మాట. ఒక ఊరిలో ఇద్దరు అత్తాకోడళ్లు.. అత్తగారు కాకిని తోలిన ఎంగిలి చేయిని కూడా కోడలి ముందు విదిల్చేది కాదట. అంత వేధించి వేపుకు తింటున్నా.. కోడలు కొడిగడుతున్న ప్రాణాలు కండ్లలో పెట్టుకొని కాపాడుకుంటూ బతుకెళ్లదీస్తున్నది. ఇంతలో అత్తగారికి కాలం మూడింది. మహిషవాహనుడి పరివారం వచ్చి అమ్మా.. ఇక్కడి నీ పెత్తనానికి సెలవిచ్చి మాతో తరలిరా అని ఆదేశించారట. మంచం మీద వాలి యమభటుల ఆదేశాలందుకొని అలాగే కనుమూసుకొందట. కోడలు నాడి పట్టుకు చూసి అత్త పుటుక్కుమందని గ్రహించేసింది. ఎన్నాళ్ల నుంచో అన్నపానీయాలకు మొహం వాచి పోయి ఉందేమో... అప్పటికే అత్తవారు వండి ఉట్టి మీద పెట్టిన వంకాయ కూర కుండను దించి కంచంలో వేడి అన్నం పెట్టుకొని వంకాయ ముక్కలు అంచుకు ఇంత నెయ్యి వేసుకొని కొసిరి కొసిరి కొరుకుతూ... అత్తో.. అత్తా.. వంకాయ తొడిమి వేయించి తింటున్న లేవమ్మ లే.. నీకింత పెడతమ్మా లేవమ్మ లే.. అంటూ రాని దుఃఖంతో కాకి శోక రాగం అందుకుందట. అప్పటికే యమభటుల వారెంట ఊరుదాటి వెళ్లిన ఆ తల్లి వంకాయ తొడిమ వేపుడు మాట వినగానే భటులవారిని నాలుగు భజాయించి పోండేహె.. వంగతోట ఒడిసిన తరువాత వచ్చి కనపడండి. అప్పటి వరకూ సచ్చినా వచ్చేది లేదు అని దబాయించేసి.. మంచం మీద లేచి కూర్చొని కోడలిని కోటొక్కతిట్లు తిట్టడం మొదలు పెట్టిందట. ఇది కథ. వంకాయ ప్రశస్తిని చెప్పే ఇలాంటి కథలు పుంఖాను పుంఖాలు. వంకాయ అంటే నోరూరని వారెవరూ ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇంత ప్రశస్తి పొందిన వంకాయను పండించడం కూడా అంతే గగనం. మనుషులకే కాదు చీడపీడలకు కూడా వంగ తోట ప్రీతి పాత్రమే. అందుకే మొక్క ఆరాకుల దశకు ఎదిగింది మొదలు వివిధ రకాల పురుగులు దాడి మొదలు పెడతాయి. ఇందులో మొదటిది కాండం తొలిచే పురుగు, తరువాత దశలో వచ్చేది కాయతొలిచే పురుగు. చీడపీడల ఉధృతిని గమనించే పెద్దలు వంగ పండించినోడు ఏ పంట సాగుకూ వెనుకాడడన్నారు. వంగ మీద చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవాడు ఏ పంట యాజమాన్యమైనా చేయగలడన్నది పెద్దల మాట. అయితే ఆధునిక వ్యవసాయపద్ధతిలో వంగ పంట తీయాలంటే తోటను నిత్యం పురుగుమందుల్లో జలకాలాడించాల్సిందే. మిరప తరువాత అతి ఎక్కువగా పురుగు మందుల వాడకం వంగ తోటలోనే అన్నది అతిశయోక్తి కాదు. పురుగు మందు చల్లిన మరుసటి రోజే కాయలు కోసి మార్కెట్కు తరలించాల్సిన పరిస్థితి. ఎంతో ఇష్టంగా వంకాయను ఆరగించే వినియోగదారుడు దానిలో ఇంకిపోయిన విషాన్ని కూడా భుజిస్తున్న పరిస్థితి. విషరహితమైన వంకాయలు తినాలంటే ప్రకృతి సేద్య విధానమొక్కటే మార్గం. అందుకే ప్రకృతి సేద్య విధానంలో వంగ తోట సస్యరక్షణ నిర్వహణను తెలుసుకుందాం. ఇది ఉష్ణమండలపు కూరగాయ. విటమిన్ ఎ, బి పుష్కలంగా లభించే వంకాయను మధుమేహ రోగులూ తినొచ్చు. సాగు విధానం: వంగసాగుకు దుక్కి చేసేముందే దుక్కిలో పశువుల ఎరువు, కోడి పెంట సమపాళ్లలో వేసుకొని దుక్కి చేసుకోవాలి. వంగ మొక్కలు నాటుకోవడంతో పాటు చుట్టూ ఎరపంటగా ఆముదం వేసుకోవాలి. ఇది క్రిమికీటకాలను ఆకర్షించడం వలన ప్రధాన పంటకు రక్షణలభిస్తుంది. అంతర పంటగా వంగతోటలో ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగుల బెడద తగ్గుతుంది. అంతర పంటగా సోయకూర వేసుకోవడం మంచిది. ఇది కూడా కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను దరి చేరనీయదు. మొక్క 50 రోజుల వయసు వచ్చే నాటికి ఎకరాకు 40 కిలోల వేపగింజల చెక్క వేస్తే దిగుబడి పెరుగుతుంది. తామర పురుగుల నివారణకు 4 కిలోల వేపగింజల పొడి, 4 కిలోల సన్నగా తరిగిన కలబందను 100 లీటర్ల నీటిలో 10 రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకొని పిచికారీ చేస్తేతామరపురుగు, ఇతర రసం పీల్చే పురుగుల బెడద ఉండదు. పసుపు పొడి, బూడిద సమపాళ్లలో కలిపి ఉదయం వేళల్లో ఆకుల మీద చల్లితే పచ్చదోమ, తెల్లదోమ దరి చేరవు. వంగ తోటకున్న మరో బెడద పిండినల్లి. దీన్ని సున్నం చల్లి నివారించవచ్చు. మొక్క మొదలుకు వేప చెక్క వేస్తే.. వేరు, కాండం కుళ్లును నివారిస్తుంది. కాండం తొలిచే పురుగు, పెంకు పురుగు, కంపు నల్లిని నివారించడానికి సీతాఫలం, వేపపిండి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ముద్దగా నూరిన కిలో సీతాఫలం ఆకులు, కిలో వేప చెక్క, 2.5 లీటర్ల ఆవుమూత్రంలో ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి పిచికారీ చేస్తే కాండం తొలిచే పురుగులతో పాటు అన్ని రకాల కీటకాలు పోతాయి. ప్రకృతి సేద్య విధానం అనుసరిస్తున్న రైతులు అనేక మంది ఈ విధంగా వంగ సాగు సాధ్యమేనని విజయవంతంగా చాటుతున్నారు. - జిట్టా బాల్రెడ్డి, సాగుబడి డెస్క్ -
వంగ రైతు బెంగ
తాడేపల్లి రూరల్/తుళ్లూరు, న్యూస్లైన్: వంగ రైతులకు బెంగ పట్టుకుంది. అదుపుకాని పుచ్చు తెగులుతో అల్లాడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి పురుగు మందులు పిచికారీ చేస్తున్నా తెగులు అదుపు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తాడేపల్లి, తూళ్లూరు, నారాకోడూరు, బుడంపాడు తదితర ప్రాంతాల్లోని రైతులు ఈ ఏడాది దాదాపు 500 ఎకరాల్లో వంగ సాగు చేపట్టారు. తొలి నుంచి తోటలు ఏపుగా పెరగడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించారు. అయితే వరుస తుపానులతో తోటలు అక్కడక్కడా దెబ్బతిన్నాయి. వీటిని బతికించుకోవడానికి మళ్లీ ఎదురు పెట్టుబడులు పెట్టిన రైతులకు నిరాశే మిగిలింది. తోటలను పుచ్చుతెగులు ఆశించడంతో పంట దిగుబడి పడిపోయింది. 90 శాతం కాయలు పుచ్చులతో రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్ని మందులు వాడినా అదుపుకాకపొవడంతో కాయ కోసి పారవేస్తున్నారు. ఎకరా వంగ సాగుకు సుమారు రూ. 70 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా ధర రూ. 1000 నుంచి రూ. 1500 వరకు పలుకుతోంది. తుళ్లూరు మండలంలోని శాఖమూరుకు చెందిన రైతు చింకా శంకరరావు ఎకరా నేలలో వంగతోట సాగు చేశారు. దిగుబడి వచ్చేసరికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ. 70 వేలు పెట్టుబడి అయింది. కొద్దిరోజుల నుంచి పుచ్చుతెగులు సోకి పంట అంతా దెబ్బతింది. దీంతో దిగుబడిలో ఎక్కువ శాతం కాయ పుచ్చులు పుచ్చులుగా వస్తున్నాయి. ఐదు బస్తాల్లో ఒక్క బస్తా మంచి కాయ మాత్రమే లభించిందని శంకరరావు తెలిపారు. దీంతో పురుగు మందులు, కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి రైతు నల్లపు కోటయ్య కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఎకరా పొలాన్ని రూ. 30 వేలకు కౌలుకు తీసుకుని రూ. 70 వేలు ఖర్చు పెట్టి వంగ సాగు చేపట్టాడు. పంట ఏపుగా పెరిగి చేతికి అందివచ్చే సమయానికి తెగులు తగిలింది. తన పంటకు సోకిన తెగులు ఏమై ఉంటుందోనని ఆందోళన చెంది మండల వ్యవసాయాధికారి కార్యాలయానికి వెళితే అక్కడ తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏ ఒక్క అధికారి లేకపోవడంతో వెనుదిరిగాడు. వచ్చిన నష్టానికి కుమిలిపోతున్నాడు.