
పెట్రోలు బంకుల్లో భధ్రత కరువు
- నిబంధనలు పాటించని యజమానులు
- అందుబాటులో లేని ఎయిర్ ఫిల్లింగ్ యంత్రాలు
- వాహనదారులకు అసౌకర్యం
- పట్టించుకోని అధికారులు
మెదక్:పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలు పాటించడం లేదు. ఈ బంకులను అడ్డగోలుగా నడుపుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. భద్రత చర్యలూ పాటించడం లేదు.మెదక్ పట్టణంతోపాటు మండల పరిధిలో మొత్తం 10 వరకు ఉంటాయి. అనేక బంకుల్లో పైన కప్పు ఉండదు. దీంతో వర్షం వచ్చిన, ఎండకొట్టినా సిబ్బందితోపాటు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల టైర్లలో గాలి నింపుకోవడానికి కొన్ని బంకుల్లో ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్లు లేకపోవడంతో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.
బంకుల యజమానులు నిబంధనలు పాటించకపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల భద్రతకు అవసరమైన ఏర్పాట్లు చేయడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా స్పందించి బంకుల్లో సౌకర్యాలు కల్పించేలా చూడాలని వారు కోరుతున్నారు.