అలజడి
అలజడి
Published Sun, Mar 26 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 7:09 AM
- నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి
- అంతకు మించితే నగదు రహితమే..
- కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై వాణిజ్య వర్గాల ఆందోళన
- చిరు వ్యాపారాలకు నష్టమేనని ఆవేదన
- నేడు వర్తక నేతల సమావేశం
సాక్షి, రాజమహేంద్రవరం : అమ్మకందార్లను, కొనుగోలుదార్లను పన్ను పరిధిలోకి తెచ్చేలా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై రూ.3 లక్షల పరిమితి విధించిన సంగతి తెలిసిందే. దీనిని తాజాగా రూ.2 లక్షలకు కుదించింది. దీనిపై వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని వ్యాపార సంఘాల ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం నేపథ్యంలో.. సోమవారం రాజమహేంద్రవరం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన దాదాపు 70 వర్తక సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయ ప్రభావం, దాని అమలులో వ్యాపారులు ఎదుర్కొనే ఇబ్బందులు, చిరువ్యాపారులు ఎంతమేర నష్టపోతారన్న అంశాలపై చర్చించనున్నారు.
జిల్లాలో దాదాపు 15వేల మంది వ్యాపారులు అమ్మకం పన్ను పరిధిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న వారి పన్ను స్లాబ్ మారనుంది. రూ.2 లక్షలు దాటిన లావాదేవీలు నగదు రహితంగా చేయాలన్న నిబంధనతో అమ్మకంపై తప్పనిసరిగా పన్ను చెల్లిచాల్సి వస్తుంది. ఈ నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గ్రామాలు, పట్టణాల్లో కిరాణా, ఇతర వ్యాపారాలు చేస్తున్నవారు అరకొర ఆదాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వీరందరూ పన్ను పరిధిలోకి రానున్నారు. అలాగే ఏడాదిలో ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నగదు లావాదేవీలు ఏదైనా ఒక సందర్భంలో రూ.2 లక్షలు దాటితే, అధికారులు లెక్కల్లో అది తేలితే, అమ్మకందారుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏదేమైనా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారన్న ఆందోళన వర్తక వర్గాల్లో నెలకొంది.
చిరు వ్యాపారులు దెబ్బతింటారు
కేంద్రం నిర్ణయంవల్ల చిరు వ్యాపారులు దెబ్బతింటారు. చిరు వ్యాపారుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఈ నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతుంది. రోజుకు నాలుగైదొందలు సంపాదన వచ్చేవారు ప్రతి రోజూ దాదాపు రూ.5 వేల వ్యాపారం చేయాల్సి ఉంటుంది. ఏడాదికి నగదు లావాదేవీలపై రూ.2 లక్షల పరిమితి విధించడంవల్ల చిరు వర్తకులు వ్యాపారాలు మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
- బూర్లగడ్డ సుబ్బారాయుడు, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్, రాజమండ్రి
అమలులో అనేక ఇబ్బందులుంటాయి
గ్రామీణ రైతులు లేదా ఇతరులు ఏదైనా శుభకార్యాన్ని పురస్కరించుకుని బంగారం కొంటారు. ఇది రూ.2 లక్షలకు మించి ఉంటుంది. ఆ సమయంలో నగదు కాకుండా చెక్కు, డీడీ ఇవ్వాలని అడిగితే వారికి ఆ సదుపాయం ఉండదు. బంగారం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉన్నా నగదు లావాదేవీల పరిమితితో సాధ్యం కాదు. ఇది ఇబ్బందికరమే.
- కడియాల శ్రీనివాస్, అధ్యక్షుడు, సువర్ణ వర్తక సంఘం, రాజమహేంద్రవరం
Advertisement
Advertisement