
కోళ్లు రెడీ.. కొట్లాట లేదు! .
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నదమ్ములే దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేలను ప్రోత్సహిస్తున్నారు.
► నిఘా నీడలో శివపల్లి
►దశాబ్దాలుగా కోడి పందేలకు కేంద్రం
►రెండేళ్లుగా నిషేధం అమలు
►ఈయేడూ కట్టడికి పోలీసుల వ్యూహం
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నదమ్ములే దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేలను ప్రోత్సహిస్తున్నారు. పండుగ వచ్చిందంటే చాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పందెంరాయుళ్లు కారులో, జీపుల్లో గ్రామానికి చేరుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. విజయరమణారావు తండ్రి కాలం నుంచి గ్రామంలో పెద్దరికం కొనసాగుతుండగా, ఆ కుటుంబం కోడి పందేలకు అండగా నిలుస్తోంది. విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పం దేలు జోరందుకున్నాయి. వందల్లో ఉన్న పం దెంరాయుళ్ల సంఖ్య వేలకు చేరింది. తన పదవీకాలం ఐదేళ్లలో విజయరమణారావు ఏటా సంక్రాంతికి పెద్ద జాతరే నడిపించారు. రెండేళ్ల క్రితం పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో ఈ పందేలపై నిషేధం విధించింది. దీంతో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కోడిపుంజుల కొట్లాటను పోలీసులు కట్టడి చేశారు. గతేడాది పందెంరాయుళ్లను వారం రోజుల ముందే అదుపులోకి తీసుకున్నారు.
కొట్లాటే లేదు
జిల్లాలో చాలా గ్రామాల్లో నాటుకోళ్లు పెంచేవారంతా పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోడి మార్కెట్‌లో రూ.400 నుంచి రూ.500లకు లభిస్తుండగా, పందెం కోడికి రూ.2 వేలు పలుకుతోంది. దీంతో చాలా మంది గ్రామాల్లో పందెం కోళ్లను పెంచేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ పందెం కోళ్లను నాగపూర్, చంద్రాపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన వారు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు.
గ్రామంపై ప్రత్యేక నిఘా
జిల్లాలోని శివంపల్లిలో చాలా ఏళ్లుగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ పందేలను ప్రభుత్వం నిషేధించింది. దీంతో పందేలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కూడా గ్రామంపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఊళ్లోకి వచ్చిపోయేవారిపై దృష్టిసారించాం. ఎవరైనా రహస్యంగా పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు . – మల్లారెడ్డి, ఏసీపీ
పందేలు నిలిపేసినం..
దశాబ్దాలుగా గ్రామంలో కోడి పందేళు జరిగాయి. అందరూ ఇష్టంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆంధ్రా ప్రాంతం మాదిరిగా రూ.వేలల్లో కాకుండా వందల్లో సరదాగా డిపాజిట్లు కొనసాగేవి. ప్రస్తుతం ఇలాంటి ఆటలు నిషేధించడంతో గ్రామంలో సైతం పందేలు ఆలిపేసినం.
– శ్యామ్‌సుందర్‌రావు, సర్పంచ్