
సీఆర్‌డీఏ చైర్మన్‌గా మంత్రి నారాయణ?
అమరావతి : రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) చైర్మన్‌గా పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పంగూరు నారాయణ త్వరలో నియమితులు కానున్నారని, రాజధాని ప్రాంతం అభివృద్ధి, నిర్మాణ పనుల్ని పర్యవేక్షించనున్నారని టీడీపీ, అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం సీఆర్‌డీఏ చైర్మన్‌గా సీఎం హోదాలో చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు.
నారాయణ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. సీఎం తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో నారాయణను చైర్మన్‌గా చేస్తారని సమాచారం. త్వరలో రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మార్పుల్లో నారాయణను మంత్రిపదవి నుంచి తొలగించి సీఆర్‌డీఏ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది.
నారాయణను చైర్మన్‌గా నియమించాలంటే సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందు ఆర్డినెన్స్‌ను జారీచేసి తరువాత అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి. నారాయణ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
సీఆర్‌డీఏ చైర్మన్‌గా నియమితులయ్యాక ఎమ్మెల్సీగా కూడా ఆయన కొనసాగరని టీడీపీ వర్గాలు అంటున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన నారాయణ రాజకీయంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారని, అందువల్లే ఆయన్నుమంత్రి పదవి నుంచి తొలగించి సీఆర్‌డీఏ చైర్మన్ పదవిని కట్టబెట్టబోతున్నారని నెల్లూరు జిల్లా టీ డీపీ వర్గాల సమాచారం.