దాసరికి తుది వీడ్కోలు..
మొయినాబాద్ రూరల్ (చేవెళ్ల) : సినీ దర్శకుడు, నటుడు, సామాజిక ఉద్యమకారుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు అంత్యక్రియలు బుధవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట సమీపంలోని ఆయన ఫాంహౌస్ పద్మ గార్డెన్స్‌లో ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఆయన అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య దాసరి నారాయణరావు కుమారుడు ప్రభు చితికి నిప్పంటించారు. దాసరి భౌతికకాయానికి నిప్పంటించే ముందు పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
అంతకుముందు హైదరాబాద్ నగరంలోని ఫిలిం ఛాంబర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మొయినాబాద్ మండలంలోని తోల్‌కట్ట పద్మగార్డెన్‌కు చేరుకుంది. అనంతరం దాసరి పద్మ సమాధి పక్కన ఏర్పాటు చేసిన చితిపై దాసరి మృతదేహాన్ని ఉంచారు. దాసరి చితిపై చేవెళ్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పుష్పగుచ్చాలుంచి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పోలీసులు కార్యక్రమాన్ని నిర్వహించారు.
హాజరైన సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు...
దాసరి అంత్యక్రియలకు సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత కోడి రామకృష్ణ, సినీ నటులు మోహన్‌బాబు, ఆయన కుటుంబ సభ్యులు, ఆర్. నారాయణమూర్తి, శ్రీకాంత్, శివాజీ, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతురావు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ముద్రడడ పద్మనాభం తదితరులు హాజరయ్యారుజ
కన్నీరు మున్నీరైన దాసరి కుటుంబ సభ్యులు
దాసరి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దహనసంస్కారం జరుగుతున్న సమయంలో అందరూ ఒక్కసారిగా బోరున రోదించడం అందరినీ కంట తడి పెట్టించింది. దాసరి నారాయణరావు కుమారులు ప్రభు, అరుణ్, కూతురు హేమ, మనుమలు, మనవరాళ్లు తాత మరణాన్ని జీర్ణించుకోలేక కంటతడి పెట్టుకున్నారు.
భార్య సమాధి పక్కనే..
దాసరి నారాయణరావు గతంలో ఫాంహౌస్‌కు 15 రోజులకొకసారి, పండుగలప్పుడు ఫాంహౌస్‌కు వచ్చేవారని ఫాంహౌస్ మేనేజర్ మధుసూదన్‌రావు తెలిపారు. ఆయన వచ్చినప్పుడల్లా నా సమాధిని కూడా తన భార్య పద్మ సమాధి పక్కనే ఏర్పాటు చేయాలని చెప్పేవారన్నారు.
మూలస్తంభాన్ని కోల్పోయాం : ఎస్పీ బాలసుబ్రమణ్యం
దాసరి మరణం తెలుగు సినీ రంగానికి తీరని లోటు. ఆయన మరణంతో తెలుగు సినీరంగం మూలస్తంభాన్ని కోలో‍్పయినట్టయిందని ఎస్పీ బాలసుబ్రమణ్యం అన్నారు. దాసరి అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతోమంది నటులు, నటీమణులను, కళాకారులను పోషించి చిత్ర పరిశ్రమకు అందించిన దాసరి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.
యువతకు చేయూతనిచ్చిన దాసరి : వీహెచ్
సినీరంగంలో యువతకు దాసరి ఎంతో చేయూతనిచ్చాడని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. పద్మ గార్డెన్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దర్శకరత్న దాసరి మృతి యువతకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. రాజకీయంగా, సినీరంగంలో అందరినీ కలుపుకుపోయే స్వభావం కలిగిన మహనీయుడు దాసరి అన్నారు.