ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ సోమవారం (మార్చి 7) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏపీ ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. సోమవారం రోజున ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి హర్షం వ్యక్తం చేసింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయని సినీ పెద్దలు అభిప్రాయపడ్డారు. పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన సీఎం జగన్‌ను త్వరలోనే కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామన్నారు.
ఈ మేరకు నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్, జెమిని కిరణ్ సహా పలువురు ఎగ్జిబిటర్లు హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష అని, అందుకు తగినట్లుగా పనిచేసేందుకు కృషి చేయనున్నట్లు సి. కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఒక మెగా ఈవెంట్ నిర్వహించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సన్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా భావించే చిరంజీవిని కలిసి వివరిస్తామన‍్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మరింత చొరవ తీసుకోవాలని కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. థియేటర్లు కళకళలాడితేనే సినీ పరిశ్రమ బాగుంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment