ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సత్కరిస్తున్నమెగాస్టార్ చిరంజీవి
సాక్షి, అమరావతి/గన్నవరం: సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన, ఆకాంక్షను అభినందిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను ముఖ్యంగా ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు, సినీ కార్మికుల కష్టాలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించానన్నారు. తాను చెప్పిన అన్ని విషయాలను సానుకూలంగా ఆలకించారని తెలిపారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతూ గన్నవరం విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. టికెట్ల వివాదం జఠిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా తనను ఆహ్వానించారని.. భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చెప్పారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా తనను ఆహ్వానించి, విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
ఆ ఆలోచన నాకు బాగా నచ్చింది
► సినిమా అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ఆలోచన నాకు బాగా నచ్చింది. సినిమా టికెట్ల ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు.. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు.
► ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలో వినడం కాదు, రెండో కోణంలోనూ వినాలని సీఎం అన్నారు. రెండు వైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అది ఎంతో బాధ్యతగా అనిపించింది. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల ఇబ్బందులు ఒక్కొక్కటి సీఎం జగన్‌కు కూలంకషంగా తెలియజేశాను.
ఎన్నో ఇబ్బందులున్నాయి..
► సినీ ఫీల్డ్ పైకి కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఎంతో మంది ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. సినిమా హాళ్లు మూసేస్తే బెటర్ అనే భావనలో కొందరు యజమానులు ఉన్నారు.
► కోవిడ్ సమయంలో సినీ కార్మికులు దయనీయ పరిస్థితిలో గడిపారు. ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటితో పాటు ఇండస్ట్రీలో అన్ని కేటగిరీలకు చెందిన వారి సమస్యలను వివరించాను. నిర్మాణాత్మక సూచనలు చేశాను.
అన్నీ పరిశీలిస్తామన్నారు
► అన్ని రకాలుగా ఆలోచించి, ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను పునః పరిశీలిస్తామని తెలిపారు.
► ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. వీటిని ప్రభుత్వ కమిటీకి నివేదిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశం వివరాలను హైదరాబాద్‌కు వెళ్లాక సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు తెలియజేస్తాను.
► ఆ తర్వాత మరోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతాను. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం. ఒక వేళ నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. సినీ ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి లేనిపోని కామెంట్స్ చేయొద్దని కోరుతున్నా.
► పెద్ద బడ్జెట్ సినిమానా.. లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే జీవో ఇస్తామని సీఎం తెలిపారు.
సీఎం జగన్‌ను సన్మానించిన చిరంజీవి
చిరంజీవి గురువారం తాడేపల్లిలోని సీఎం ఇంటి వద్దకు రాగానే వైఎస్ జగన్ సాదరంగా ఆయన్ను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చిరంజీవి తొలుత వైఎస్ జగన్‌ను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇద్దరూ 1.20 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీపై చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. పండుగ పూట సీఎం నాతో సోదరుడిగా వ్యవహరించారని, వైఎస్ భారతి ఆప్యాయంగా వడ్డించారని ఆనందం వ్యక్తం చేశారు. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నప్పుడు, 3.10 గంటలకు తిరిగి వెళ్లేటప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment