వ్యక్తిగత జీవం నుంచి వచ్చిందే ‘మిగ్గు’
-
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి
హుస్నాబాద్ : వ్యక్తిగతజీవం నుంచి వచ్చిందే మిగ్గు కవిత సంపుటి అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. పట్టణంలో పొన్నాల బాలయ్య రచించిన మిగ్గు కవితా సంపుటి పరిచయకార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ కవిత్వం అనేది ప్రజలకు సేవ చేయడమని, హృదయ వైశాల్యం కలిగిన కవిత్వాన్ని రచించడం ఓ నైజమన్నారు. ఔదార్యం, నైపుణ్యం, ఓపిక కలిగిన మానవసంబంధం ఉన్న వ్యక్తి పొన్నాల బాలయ్య అని కొనియాడారు. దళిత, బహుజన తెలంగాణ అస్థిత్వం ఉన్న కవిత సంపుటిని ప్రజలకు అందించడం వరమన్నారు. కవి ఎప్పుడు ప్రజలకు కొత్తదనాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్ గాదెపాక రవీందర్, కవులు నారాయణ శర్మ, అన్వర్, తైదల అంజయ్య, వడ్డెపల్లి మల్లేశం పాల్గొన్నారు.