nandini Sidhareddy
-
కత్తుల సిద్ధారెడ్డి
నందిని సిధారెడ్డి అసలు పేరు నర్ర సిద్ధారెడ్డి. ‘నర్ర’ కూడా ఆయన పూర్వీకులు బందారంలో స్థిరపడిన తర్వాతే వచ్చింది. ఆయన తాతల తరం వారు ముస్తాబాద్ సమీపంలోని బండలింగంపల్లిలో ఉండేవాళ్లట. అక్కడ వారిని ‘కత్తుల’ అనే ఇంటిపేరుతో పిలిచేవారట. ఆయన తాతల కాలంలో బందారంలో స్థిరపడటం వల్ల, బందారంలో వారి బంధువులందరిదీ ‘నర్ర’ కావడం వల్ల, వీరికి కూడా నర్ర ఇంటిపేరుగా మారింది. ఈయన కాలేజీ రోజుల్లో కవిత్వం రాస్తున్నప్పుడు నర్ర సిద్ధారెడ్డి పేరుతో నలుగురు వ్యక్తులు ఉండేవారు. ఈయన కవిత అచ్చయినప్పుడు మరో నర్ర సిద్ధారెడ్డికి అభినందనలు చెప్పారు. పేరు విషయంలో గందరగోళం ఏర్పడింది. అప్పుడే కవిమిత్రుడు మల్లారెడ్డి ‘గులాబీల’ మల్లారెడ్డిగా పేరు మార్చుకోగా, ఆనందం తన ఇంటిపేరును ‘మల్లెల’గా మార్చుకున్నాడు. నర్ర అంటే ఎద్దు. దానిని నంది అన్నా అర్థంలో తేడా రాదు. అంతేగాక నంది తిమ్మనలా వినూత్నంగా కూడా ఉంటుందని తన పేరులో నంది కలుపుకొని కొన్ని రోజులు కవిత్వం రాశాడు. అయితే సిద్ధిపేట కవి, పండితుడైన ఉమాపతి పద్మనాభశర్మ, నంది అంటే నిండుగా లేదని నందికి ‘ని’ జోడించాడు. దాంతో నందిని సిద్ధారెడ్డి అయ్యాడు. ఇక, ఆధునిక కవిత్వం అధ్యయనం చేస్తున్నప్పుడు ‘ఫిడేలు రాగాల డజన్’ పట్టాభి తన పేరును ‘పఠాభి’ అని చెప్పుకోవటం నచ్చింది. ఆయన ద్విత్వ టకారం తీసేసి మహాప్రాణాక్షరమైన ‘ఠా’ చేర్చుకున్నట్లు, తన పేరులోనూ ద్విత్వ ‘ద’కారం తీసేసి ‘ధా’గా మార్చుకున్నాడు. ఇన్ని మార్పుల తర్వాత నందిని సిధారెడ్డిగా మార్పు చెంది, స్థిరపడిపోయాడు. (సౌజన్యం: తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ప్రచురించిన ‘శిఖరం’లోని డాక్టర్ వి.శంకర్ వ్యాసం) -
త్వరలో ‘పునాస’ త్రైమాసిక పత్రిక: నందిని సిధారెడ్డి
సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ప్రభుత్వ సహకారంతో ‘పునాస’త్రైమాసిక తెలుగు పత్రిక రాబోతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో జరిగిన సాహిత్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యాన్ని ఇతర భాషల్లో అనువదించే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. హిందీ, ఇంగ్లిష్, దక్షిణ భారత భాషల్లో తెలుగు సాహిత్యాన్ని తీసుకురావడానికి కార్యాచరణ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రపంచ తెలంగాణ మహాసభల సందర్భంగా శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఉన్న సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. కాకతీయుల కాలం నుంచి నిజాం ప్రభువుల వరకు ఉన్న సాహిత్యం ముద్రణ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. నిజాం కాలం నుంచి ఆధునిక కవుల వరకు ఉన్న సాహిత్యంపై పుస్తకాలను తీసుకువస్తామని తెలిపారు. ప్రపంచ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్యం విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ తెలంగాణ మహాసభల్లో 1,500 మంది కవులు తమ కవితలను వినిపించారని, కవితా శైలి, నిర్మాణం, వంటి విషయాల్లో నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. -
5 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 2000 మందికిపైగా ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 1,473 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రతినిధుల నమోదుకు డిసెంబర్ 5వ తేదీ వరకు గడువు విధించినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. సుమారు 6 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు అకాడమీ అంచనా వేస్తోంది. ఇందుకు తగిన విధంగానే భోజనం, రవాణా, వసతి, తదితర సదుపాయాలపైన అధికారయంత్రాంగం దృష్టి సారించింది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు, రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగులలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలలో మహాసభలు జరుగనున్న సంగతి తెలిసిందే. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ఆదివాసీ, గిరిజన, జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంది. ప్రతినిధులు తమకు నచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి 19 వరకు 5 రోజులపాటు జరుగనున్న ఈ మహాసభల్లో లోపాలకు తావు లేకుండా సాంస్కృతిక, పర్యాటక, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఆర్అండ్బీ, తదితర విభాగాల మధ్య పని విభజన చేశారు. మహాసభల సందర్భంగా 100 పుస్తకాలను ఆవిష్కరించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. 10 దేశాలు, 52 మంది ప్రతినిధులు... ఈ మహాసభల్లో పాల్గొనేందుకు 10 దేశాల నుంచి 52 మంది అతిథులను ఆహ్వానించగా ఇప్పటి వరకు 34 మంది తమ ఆమోదాన్ని తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆ స్ట్రేలియా, మలేసియా, మారిషస్, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయిల్, కువైట్ దేశాల నుంచి అతిథులు తరలిరానున్నారు. వివిధ దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు ఈ సభలకు రానున్నట్లు అంచనా. ఇప్పటి వరకు 152 మంది తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 557 మంది ప్రతినిధులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సభల ప్రారంభ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. -
వ్యక్తిగత జీవం నుంచి వచ్చిందే ‘మిగ్గు’
తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి హుస్నాబాద్ : వ్యక్తిగతజీవం నుంచి వచ్చిందే మిగ్గు కవిత సంపుటి అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. పట్టణంలో పొన్నాల బాలయ్య రచించిన మిగ్గు కవితా సంపుటి పరిచయకార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ కవిత్వం అనేది ప్రజలకు సేవ చేయడమని, హృదయ వైశాల్యం కలిగిన కవిత్వాన్ని రచించడం ఓ నైజమన్నారు. ఔదార్యం, నైపుణ్యం, ఓపిక కలిగిన మానవసంబంధం ఉన్న వ్యక్తి పొన్నాల బాలయ్య అని కొనియాడారు. దళిత, బహుజన తెలంగాణ అస్థిత్వం ఉన్న కవిత సంపుటిని ప్రజలకు అందించడం వరమన్నారు. కవి ఎప్పుడు ప్రజలకు కొత్తదనాన్ని సృష్టించాలని ప్రయత్నిస్తాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య , మాజీ సర్పంచ్ కేడం లింగమూర్తి, కౌన్సిలర్ గాదెపాక రవీందర్, కవులు నారాయణ శర్మ, అన్వర్, తైదల అంజయ్య, వడ్డెపల్లి మల్లేశం పాల్గొన్నారు.