సాక్షి, యాదాద్రి: తెలంగాణ సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయడానికి ప్రభుత్వ సహకారంతో ‘పునాస’త్రైమాసిక తెలుగు పత్రిక రాబోతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి వెల్లడించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరిలో జరిగిన సాహిత్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సాహిత్యాన్ని ఇతర భాషల్లో అనువదించే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు.
హిందీ, ఇంగ్లిష్, దక్షిణ భారత భాషల్లో తెలుగు సాహిత్యాన్ని తీసుకురావడానికి కార్యాచరణ ప్రారంభమైందని పేర్కొన్నారు. ప్రపంచ తెలంగాణ మహాసభల సందర్భంగా శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఉన్న సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకువచ్చామన్నారు. కాకతీయుల కాలం నుంచి నిజాం ప్రభువుల వరకు ఉన్న సాహిత్యం ముద్రణ ప్రక్రియ జరుగుతోందని వెల్లడించారు. నిజాం కాలం నుంచి ఆధునిక కవుల వరకు ఉన్న సాహిత్యంపై పుస్తకాలను తీసుకువస్తామని తెలిపారు.
ప్రపంచ మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్యం విశ్వవ్యాప్తమైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ 1వ తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ చట్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచ తెలంగాణ మహాసభల్లో 1,500 మంది కవులు తమ కవితలను వినిపించారని, కవితా శైలి, నిర్మాణం, వంటి విషయాల్లో నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment