► పరీక్ష ప్రారంభమైన తర్వాతే తతంగం
► ఇన్విజిలేటర్లే కీలకం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నపత్రం ఇచ్చిన మరుక్షణమే సదరు ప్రశ్నపత్రాలు వాట్సాప్ ద్వారా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన తెలుగు పేపర్-1,2 ప్రశ్న పత్రాలను ఇన్విజిలేటర్లే సెల్‌ఫోన్ల ద్వారా చిత్రీకరించి వాట్సాప్ ద్వారా బయటకు పంపినట్లు సమాచారం. పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు వాడవద్దంటూ జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. జిల్లాకు సంబంధించి 235 కేంద్రాల్లో 52,546 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మార్చి 21, 22 తేదీల్లో తెలుగు పేపర్-1,2 పరీక్షలు పూర్తయ్యాయి.
ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రం నుంచే బయటకు వచ్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారులు పసిగట్టారు. ఇందులో సెల్‌ఫోన్ల ద్వారా ఇన్విజిలేటర్లు కీలకంగా వ్యవహరించినట్లు తెలుసుకుని పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్ల వాడకాన్ని నిషేధించారు. ఈ మేరకు బుధవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డితో మాట్లాడగా పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, విద్యార్థులు సెల్‌ఫోన్లు వాడడంపై నిషేధం ఉందని తెలిపారు. కొందరు అధికారులు పరీక్ష మొదలైన తరువాత ప్రశ్న పత్రాన్ని బయటకు పంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు.
వాట్సాప్‌లో టెన్త్ ప్రశ్నపత్రాలు?
Published Thu, Mar 24 2016 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM
Advertisement